కోడి పందాల్లో లేకున్నా ఉన్నట్టుగా చూపడం మీ అజెండా.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా?: చింతమనేని ఫైర్

Published : Jul 07, 2022, 12:01 PM IST
కోడి పందాల్లో లేకున్నా ఉన్నట్టుగా చూపడం మీ అజెండా.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా?: చింతమనేని ఫైర్

సారాంశం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో నిర్వహించిన కోడి పందాల్లో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారని.. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయంపై చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో నిర్వహించిన కోడి పందాల్లో పాల్గొన్న పలువురుని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కోడి పందాల నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. అయితే ఈ విషయంపై చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూపడం కొందరి జెండా.. అజెండా అని పేర్కొన్నారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. 

‘‘కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా.. అజెండా. ఇంత రాక్షస రాజకీయం అవసరమా..?. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి. ఈ నీచమైన ప్రచారంతోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి   నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయింది. మీ అసత్యాలు సాక్షి నీ ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయింది. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని చింతమనేని ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. 

ఇక, పోలీసులు పక్కా సమాచారంతో బుధవారం సంగారెడ్డి జిల్లా  పటాన్‌చెరు సమీపంలోని పెద్దకంజెర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో అక్రమ కోడిపందాల రాకెట్‌లో పాల్గొన్న 21 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, 26 బైక్‌లు, 27 సెల్‌ఫోన్లు, 30 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ రాకెట్ నిర్వహిస్తున్నారని పటాన్‌చెరు డీఎస్పీ బీమ్‌రెడ్డి తెలిపారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, అక్కినేని సతీష్ బృందంగా ఆడుతున్నారని చెప్పారు. దాడి చేసిన సమయంలో అక్కడ 70 మంది వరకు ఉన్నారని చెప్పారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీష్, బర్ల శ్రీనులను అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టినట్టుగా పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu