ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ''ఒకే రాజధాని'': గవర్నర్ కు చంద్రబాబు లేఖ

By Arun Kumar P  |  First Published Jul 19, 2020, 9:43 AM IST

రాష్ట్ర రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు లేఖ రాశారు.


అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని... కాబట్టి అలాంటి నిర్ణయాలను అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాలంటూ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

చంద్రబాబు లేక యధావిదిగా...

Latest Videos

undefined

గౌ. శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ గారికి,

నమస్కారాలు.


విషయం: 2014 లో సొంత రాజధాని నగరం లేకుండా అవశేష ఆంధ్రప్రదేశ్  - భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ – విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతానికి ప్రాధాన్యత - అన్ని ప్రాంతాలకు సమాన దూరం – చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత - స్మార్ట్ సిటీ – రాజధాని నగరం అభివృద్ధిలో జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యం - ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల త్యాగం – రాజధాని నగరం అభివృద్ధికి రూ 10,000 కోట్ల ప్రజా ధనం వ్యయం - సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ - ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్వీర్యం చేయడం - రెండు బిల్లులు - ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం 2020 మరియు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020 -  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది –  శాసన మండలిలో సెలెక్ట్  కమిటీ వద్ద పెండింగ్‌లో ఉంది –  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇదే అంశం పెండింగ్‌లో ఉంది - ఆర్థిక భారం – 2014 ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకం - ఆంధ్రప్రదేశ్‌ను కాపాడటం గురించి...

Ref:1. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై బిల్లు, 2020.

2. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రద్దు బిల్లు, 2020.

3. పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) రిట్ పిటిషన్ నెంబర్ 8/2020 మరియు రిట్ పిటిషన్ నెంబర్ 9/2020.

4. AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014.

వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా వేదిక (పీపుల్స్ ఫోరమ్) కూల్చివేత నుండి ప్రారంభించి, పిపిఎ లను రద్దు చేయడం / సమీక్షించడం, జాతీయ ప్రాజెక్ట్ పోలవరం కాంట్రాక్టులను రీ టెండరింగ్ ఇవ్వడం, తద్వారా ప్రాజెక్ట్ నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తిలో జాప్యం చేయడం, మాతృభాషా బోధన రద్దు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భవనాలకు వైయస్ఆర్సిపి రంగులు వేయడం, ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, మీడియాపై దాడి చేయడం, వీటన్నింటికంటే ముఖ్యంగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తొలగించే ప్రయత్నాలు మరియు రాష్ట్రానికి 3 రాజధానులను ప్రతిపాదించడం..గత ప్రభుత్వ ముద్ర ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజధాని నగరాన్ని నిర్వీర్యం చేయడం, అన్నా క్యాంటీన్లను మూసివేయడం, గత ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేయడం చేస్తోంది. ఈ సమస్యల్లో కొన్నింటి గురించి గౌరవనీయులైన మీ దృష్టికి కూడా వచ్చాయని మేము భావిస్తున్నాము, అంతే కాకుండా అనేక అంశాలను హైకోర్టు / సుప్రీంకోర్టు తప్పుపట్టడం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో, AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆధారంగా నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి గురించి గౌరవనీయులైన మీ దృష్టికి తీసుకురావాలని మేము భావిస్తున్నాము. రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని కొత్త రాజధాని నగరంగా ఎంపిక చేయడం జరిగింది.  అమరావతి నగరానికి గొప్ప చారిత్రక, సాంస్కృతిక, ఆర్ధిక భౌగోళిక ప్రాముఖ్యత ఉంది.  అమరావతి రాజధాని నగరంగా మొదటి తెలుగు రాజవంశం, శాతవాహనులు ఈ ప్రాంతం నుండే రాజ్యాన్ని పరిపాలించారు. కృష్ణా నది ఒడ్డున ఈ నగరం ఉంది మరియు  శైవ మతానికి మరియు బౌద్ధమతానికి కేంద్రంగా అమరావతి గతంలో ఉండేది. నేటికీ, ఈ ప్రాంతంలోని పరమేశ్వరుడు, అమరేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ది చెందింది, ఇక్కడి బౌద్ధ స్థూపం కూడా ప్రసిద్ధి గాంచింది. 2006 లో మతగురువు దలైలామా ఆధ్వర్యంలో అమరావతిలోనే ‘‘కాలచక్ర’’  బౌద్ద సదస్సులు జరిగాయి. అంతేకాకుండా రాజధాని నగరం అమరావతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి సమాన దూరంలో ఉంటుంది, తద్వారా ఈ ప్రాంతం రాజధాని నగరానికి అత్యంత సానుకూల ప్రాంతంగా మారుతుంది.

రాజధాని నగరాన్ని అభివృద్ది చేయడానికి ఈ ప్రాంతంలోని రైతులు స్వచ్ఛందంగా  33,000 ఎకరాల భూమిని  వినూత్న పథకం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఢిల్లీ కంటే మెరుగైన నగరంగా నిర్మిస్తామని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం అమరావతిని స్మార్ట్ సిటీగా గుర్తించింది. ప్రస్తుత సెక్రటేరియట్, ఎపి లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు కౌన్సిల్, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ 2,500 కోట్లు నిధులు సమకూర్చింది. ఈ రూ 2,500 కోట్లతో పాటు, అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం సుమారు రూ 700 కోట్ల నిధులు అదనంగా సమకూర్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా గౌరవ సుప్రీంకోర్టు అమరావతిని నోటిఫై చేసింది మరియు తదనుగుణంగా, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణానికి ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా, హోంమంత్రి శ్రీ కిషన్ రెడ్డి కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా చేర్చడం ద్వారా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ను సరిదిద్దారు.

అమరావతి నగరం జాతీయ స్థాయి భాగస్వామ్యంతో పాటు, సింగపూర్ కన్సార్టియం, జపాన్ ఇంజనీర్స్, ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB)  వంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలను కూడా ఆకర్షించింది. ఇప్పటివరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు  సుమారు రూ 10,000 కోట్లు వ్యయం చేసింది. ఇప్పటి నుండి డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే, రాజధాని నగరం అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రూపొందించడం జరిగింది. మరో మాటలో చెప్పాలంటే, ఈ నగరమే స్వీయ ఆర్థిక సాయం అందించడం తోపాటుగా, ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది. అందుకే, ఈ రాజధాని నగరాన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన నగరంగా పకడ్బందీగా డిజైన్ చేయబడింది. 

ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం 2019 లో అధికారాన్ని చేపట్టింది. అప్పటినుండి, రాజధాని నగరం అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకే అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ దురుద్దేశాల్లో భాగంగానే రాజధాని నగరాన్ని నిర్వీర్యం చేయడం మరియు 3 రాజధానులను స్థాపించడం లక్ష్యంగా , తన మీడియా సంస్థలు సాక్షి టివి మరియు సాక్షి వార్తాపత్రికల ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తోంది.  రాజకీయ కక్షల ముసుగులోనే , వైయస్ఆర్సిపి ప్రభుత్వం 2 బిల్లులను తీసుకువచ్చింది.  ప్రస్తుత రాజధాని నగరం అమరావతి శిధిలాల మీద 3 కొత్త రాజధాని నగరాలను నెలకొల్పడానికే  ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి 2020 బిల్లు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ 2020 బిల్లును తెచ్చింది. ఈ 2 బిల్లులను జనవరి 2020 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు, అధికార పార్టీ మంద మెజారిటీతో ప్రభుత్వం వాటిని  ఆమోదించగలిగింది. అయితే, కౌన్సిల్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు శాసన మండలి (ఎపిఎల్‌సి) వాటిని సెలెక్ట్ కమిటీలకు సూచించింది. ఈ బిల్లులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సెలెక్ట్ కమిటీ వద్ద ఉన్నప్పటికీ, అధికార పార్టీ జూన్ 2020 బడ్జెట్ సమావేశాల్లో శాసన సభలో మళ్లీ ఈ బిల్లులను ప్రవేశపెట్టింది. అవి మళ్లీ శాసన సభలో ఆమోదించబడ్డాయి మరియు కౌన్సిల్‌కు పంపబడ్డాయి, కానీ అవి సెలెక్ట్ కమిటీ వద్ద ఉన్నందున వాటిని ప్రవేశపెట్టలేదు.

ఈ బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి(ఎపిఎల్‌సి) సెలెక్ట్ కమిటీకి సూచించినప్పటికీ, అధికార పార్టీ ఒత్తిళ్లతో సెలెక్ట్ కమిటీకి సంబంధించి బులెటిన్ జారీ చేయకుండా శాసనమండలి అధికారాలకు అడ్డుపడింది. సెలెక్ట్ కమిటి మరియు సభ్యులను నోటిఫై చేయాలన్న కౌన్సిల్ ఛైర్మన్ ఆదేశాలను, శాసనసభ కార్యదర్శి తన స్వప్రయోజనాల కోసం అధికార పార్టీతో కుమ్మక్కై పాటించలేదు.

రాజధాని నగరం అమరావతికి సంబంధించి ప్రభుత్వ విధానం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) ద్వారా సవాలు చేయబడింది. ఈ అంశాన్ని సెలెక్ట్ కమిటీకి పంపినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో అంగీకరించింది మరియు బిల్లులు ఫైనలైజ్ అయి అమల్లో రావడానికి ఇంకా సమయం అవసరమని తెలిపారు (జనవరి 23, 2020 నాటి PIL WP No. 8/2020 మరియు 9/2020- ఆర్డర్ కాపీ జతచేయబడింది). హైకోర్టులో ఈ సమస్య పెండింగ్‌లో ఉన్నప్పటికీ, జూన్ 2020 బడ్జెట్ సెషన్లలో అధికార పార్టీ నిర్లక్ష్యంగా ఈ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టింది.

ప్రస్తుత రాజధాని నగరాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో 3 రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గౌరవ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పైన పేర్కొన్న 2 బిల్లులకు సంబంధించి శాసనసభ ప్రక్రియ పూర్తయ్యే వరకు సెక్రటేరియట్, డిపార్ట్‌ మెంట్స్ హెడ్ (హెచ్ వోడి) లను మార్చవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయ హైకోర్టు నిర్దేశించిందనేది ఈ సందర్భంగా గమనార్హం.  ఈ నేపథ్యంలోనే వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్స్ 197 (1) మరియు 197 (2) ప్రకారం ఆమోదించాలని  ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారికి ఈ 2బిల్లులను పంపింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడటంలో గౌరవనీయులైన మీరు జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

ఈ సందర్భంగా గౌరవనీయులైన మీ దృష్టికి ఈ క్రింది వాస్తవాలను తీసుకొస్తున్నాము

1. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదు. సదరు 2 బిల్లులను కౌన్సిల్ యొక్క సెలెక్ట్ కమిటీకి సూచించింది. 
 
2. బిల్లులను కౌన్సిల్‌లో రెండవసారి ప్రవేశపెట్టినప్పుడు, సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్‌లో ఉన్నందున శాసన మండలి రెండవసారి బిల్లులను పరిగణించలేదు.

3. ప్రస్తుత రాజధానిని ముక్కలు చేయడం లేదా తరలించడం గురించిన అంశాలు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం లేదా ఆమోదించడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది.

4. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, సెక్షన్ 5 (2)లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
    ఉప-సెక్షన్ (1) లో సూచించిన కాలం ముగిసిన తరువాత, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘‘ఒక కొత్త రాజధాని’’ ఉంటుంది.

5.  ఇంకా, AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 6 ప్రకారం, కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది మరియు తదనుగుణంగా, అమరావతిని రాజధానిగా ఖరారు చేశారు. 

AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 6 లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

ఆంధ్రప్రదేశ్ కోసం ‘‘ఒక రాజధానిని’’ ఏర్పాటు చేయడానికి నిపుణుల కమిటీ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘‘నూతన రాజధానికి’’ సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నుండి 6 నెలలు మించని కాలంలో తగిన సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. 

AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014, సెక్షన్ 94 (3) ప్రకారం,రాజ్ భవన్, హైకోర్టు, ప్రభుత్వ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా ఆంధ్రప్రదేశ్ యొక్క ‘‘నూతన రాజధానిలో’’ అవసరమైన సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాలి.

అదేవిధంగా, చట్టం యొక్క సెక్షన్ 94 (4) ప్రకారం అవసరమైతే డిగ్రేడెడ్ అటవీ భూములను నోటిఫై చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘‘నూతన రాజధానిని’’ రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది.

భారత ప్రభుత్వం రూపొందించిన AP పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘‘ఒకే రాజధాని’’ మాత్రమే ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రవేశపెట్టిన మరియు ఆమోదించిన బిల్లులు భారతదేశ పార్లమెంట్ విధానాలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన ఈ అనాలోచిత చర్య తెలుగు ప్రజల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. అమరావతి నగరం సమకాలీన అవసరాలను తీర్చడమే కాదు, భవిష్యత్ తరాలైన మన బిడ్డల అవసరాలను తీర్చడానికి కూడా దోహదపడుతుంది. అందువల్ల పైన పేర్కొన్న 2 బిల్లులపై నిర్ణయం తీసుకునే సందర్భంగా, ఇందులో చర్చించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని,  ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులైన మీకు  విజ్ఞప్తి చేస్తున్నాము.

ధన్యవాదాలతో,

నారా చంద్రబాబు నాయుడు

శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత.

click me!