వైఎస్ వివేకా హత్య కేసు: ఇంటికి సిబిఐ అధికారులు, అనుమానితుల విచారణ

By telugu teamFirst Published Jul 19, 2020, 8:38 AM IST
Highlights

ఏపీ సీఎం వైెఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సిబిఐ అధికారులు వేగవంతం చేశారు. శుక్రవారం కడపకు చేరుకున్న సిబిఐ అధికారులు అదివారం వివేకా హత్య జరిగిన స్థలాన్ని సందర్శించనున్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన స్థలాన్ని సిబిఐ అధికారులు ఆదివారం సందర్శించనున్నారు. అనుమానితులు పలువురిని ప్రశ్నించనున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసును విచారించడానికి సిబిఐ అధికారులు శుక్రవారం కడప జిల్లాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్యాప్తు చేసిన సిట్ అధికారులను సిబిఐ అధికారులు కలిసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. శనివారంనాడు సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలకమైన సమాచారాన్ని వారు సేకరించినట్లు తెలుస్తోంది.

Also Read: వైఎస్ వివేకా కేసు: కడపకు సీబీఐ .. అజ్ఞాతంలోకి పలువురు నేతలు

పులివెందులలో వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలాన్ని, ఆయన నివాసాన్ని సిబిఐ అధికారులు ఆదివారం సందర్శించి వివరాలు సేకరించే అవకాశం ఉంది. కొంత మంది అనుమానితులను కూడా విచారించనున్నారు. 

ఇదిలావుంటే, 2019 మార్చి 14వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. కేసు విచారణకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ను ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివేకా హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ దర్యాప్తు ముందుకు సాగలేదని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని అంటూ వైఎస్ జగన్ సోదరి, వివేకానంద రెడ్డి కూతురు నర్రెడ్డి సునీత హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు.

click me!