
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న (సోమవారం) వెలువడిన పదోతరగతి ఫలితాల్లో (AP SSC Results 2022) చాలా తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడమే కాదు రాజకీయం దుమారం రేపుతోంది. ఇప్పటికే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు జగన్ సర్కార్ ఎలా ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కారణమో తెలిపేందుకు టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పదోతరగతి ఫలితాలపై స్పందించారు.
నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి... నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదని చంద్రబాబు ఎద్దువా చేసారు. గత టిడిపి హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలో వచ్చినతర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, ఉన్నవారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం చేపట్టిన అస్తవ్యస్థ విధానాలే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా? అంటూ ఎద్దేవా చేసారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదనకు గురి చెయ్యడమేనా నాడు-నేడు ఉద్దేశ్యం అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
దాదాపు రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఫెయిలై ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదని అంతా గుర్తించాలన్నారు. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని... ధైర్యంగా ఉండాలని సూచించారు. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
ఇక ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదయిన అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫెయిల్ అయ్యారన్న మనస్థాపంతో చెన్నేకొత్తపల్లిలో ఉరి వేసుకుని ఓ విద్యార్థి, పామిడి మండలం కట్టకిందపల్లిలో విషగుళికలు తాగి మరో విద్యార్థి, నల్లచెరువు మండలానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కనగానపల్లి మండలం కుర్లపల్లి తండాలో ఫినాయిల్ తాగి ఓ విద్యార్థి... చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండికి చెందిన మరో విద్యార్థిని రసాయనిక ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇక సోమవారం టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో పేరెంట్స్ మందలించారని.. విశాఖపట్నం జిల్లాలోని వేపగుంట అప్పల నరసయ్య కాలనీకి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థి సాయి అదృశ్యమయ్యాడు. సోమవారం ప్రకటించిన టెన్త్ క్లాసు పరీక్షలలో సాయి రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సాయిని మందలించారు. దీంతో సాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మేఘాద్రిడ్డ డ్యామ్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. డ్యామ్ లో దూకి సాయి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక పదో తరగతిలో 67.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు పైచేయి సాధించారు. ఉత్తీర్ణ శాతం బాలికల్లో 70.70 శాతం, బాలురలో 64.02 శాతంగా ఉంది. ఫలితాల్లో 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం ఆఖరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.