బిసి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సుప్రీంకోర్టుకు..: చంద్రబాబు వెల్లడి

By Arun Kumar PFirst Published May 25, 2021, 12:41 PM IST
Highlights

తమ పార్టీ నాయకుడు బిసి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై చర్చించేందుకు కర్నూలు నాయకులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంటిపైకి దాడి చేయడానికొచ్చిన వారిని అడ్డుకున్నందుకే జనార్ధన్ రెడ్డిపై కేసులా? అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

బిసి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై చర్చించేందుకు కర్నూలు నాయకులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిసి జనార్ధన్ రెడ్డిపై, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొందామన్నారు. కర్నూలు జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ తో ప్రజలు చనిపోతుంటే వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

''గత ఆదివారం నాడు ఎనిమిది మంది తెదేపా నాయకులను అరెస్టు చేసి ఆరుగురు ఇంతవరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచ లేదు. వారు ఎక్కడున్నారో... రెండురోజులు గడుస్తున్నా మెజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపర్చలేదో చెప్పాలి'' అని చంద్రబాబు ప్రశ్నించారు. 

read more   ఓహో! ఆనందయ్య మందుపై వివాదం అందుకోసమేనా జగన్..?: ఎమ్మెల్యే గోరంట్ల

''బిసి జనార్ధన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతాం. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. హైకోర్టు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని వ్యాఖ్యానించినా సిగ్గురాలేదు'' అంటూ మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూనే వర్చువల్ యాజిటేషన్ చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

చంద్రబాబు నిర్వహించిన ఈ వీడియో కాన్పిరెన్సులో టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,  మాజీ మంత్రి అఖిల ప్రియ, వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, తిక్కారెడ్డి, జాఖిర్ హుస్సేన్, నరసింహారెడ్డి, రామలింగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!