రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
అమరావతి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు వైఎస్ఆర్ పంటల భీమా పథకం కింద నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పారు.రూ. 1820కోట్లను ఈ దఫా పంటల భీమా కింద చెల్లిస్తున్నామన్నారు. నేరుగా రైతలు ఖాతాల్లోకి పంటల భీమా నిధులు వస్తాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయంలో రైతులకు ఎంత భీమా వచ్చిందో తెలియదన్నారు. అసలు భీమా పరిహారం వచ్చిందో రాలేదో కూడ తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని గర్వంగా చెబుతున్నామన్నారు. ఖరీఫ్ లో పంట నష్టపోయిన 15 లక్షల 15 వేల మంది రైతులకు పరిహారం చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులు, చీడ పీడలతో రాష్ట్రంలో సుమారు 15 లక్షల మందికిపై గారైతులు నష్టపోయారన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్ లో నష్టపోతే ఆ సీజన్ లోనే రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రైతులపై భారం పడకుండా ఉండేందుకు గాను పంటల భీమాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన తెలిపారు. 23 నెలల కాలంలో రైతుల కోసం తమ ప్రభుత్వం రూ. 83 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు.
పగటిపూట రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ. 17,430 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన చెప్పారు. పంటల భీమా బకాయిలను 2018-19 రూ. 715 కోట్లు చెల్లించినట్టుగా ఆయన తెలిపారు. 2019-20 లో ఉచిత పంటల భీమా పరిహారంగా మరో రూ. 1253 కోట్లు చెల్లించామని ఆయన గుర్తు చేశారు. ఈ నెలలోనే రైతు భరోసా కింద రూ. 3,900 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్టుగా సీఎం తెలిపారు.