ఏమిటీ సైకోయిజం: సబ్బంహరి ఇల్లు కూల్చివేతపై బాబు విమర్శలు

By Siva KodatiFirst Published Oct 3, 2020, 4:46 PM IST
Highlights

మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి గోడ కూల్చివేత ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు

మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి గోడ కూల్చివేత ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సబ్బంహరి ఇంటి గోడలు కూల్చడాన్ని ఖండిస్తున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

రాత్రికి రాత్రే గోడ కూల్చాల్సిన అవసరం ఏంటన్న చంద్రబాబు.. మాజీ ఎంపీకే ఇలా అయితే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్ధులేనని చంద్రబాబు మండిపడ్డారు.

కాగా, ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారని ఆరోపిస్తూ విశాఖపట్నంలోని సబ్బంహరి ఇంట్లో అక్రమంగా నిర్మించిన భాగాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే.

టీవీ డిబేట్‌లలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందునే సబ్బం హరి ఇంటిని కూల్చివేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోటస్ పాండ్, తాడేపల్లి రాజమహల్ వంటివి అవినీతి పునాదులపై కట్టిన ఇళ్లన్నారు.

అసలు కూల్చడమంటూ చేపడితే అది జగన్ ఇంటి నుంచే ప్రారంభించాలని వెంకన్న డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ధర్మాన కృష్ణదాస్ నోటీ దురుసుతో మాట్లాడుతున్నారని... అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని బుద్దా స్పష్టం చేశారు.

నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రతి ఒక్కరి లెక్కలూ రాస్తున్నామని.. వడ్డీతో సహా వాటిని చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్న వైసీపీ ఎంపీలు, రాష్ట్ర సమస్యలపై ఏ రోజూ కేంద్రాన్ని అడగలేదని బుద్ధా వెంకన్న విమర్శించారు.

మరోవైపు సబ్బంహరి ఇంట్లో కూల్చివేతలపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆయన ఇల్లు కూల్చడం అన్యాయమని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని రఘురామ ఆరోపించారు. ఆవ భూములకు అధిక ధరలు చెల్లించి అనుచరులకు లబ్ధి చేకూర్చలేదా అని రఘురామ ప్రశ్నించారు. 

 

 

తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం? (1/2) pic.twitter.com/nBbtHeVraK

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn)
click me!