ఆనాటి జ్ఞాపకాలు, ఉద్వేగం: యాగశాల వద్ద మోకరిల్లిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Dec 17, 2020, 2:24 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉద్దండరాయునిపాలెంలో నాడు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు

తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉద్దండరాయునిపాలెంలో నాడు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు.

అనంతరం యాగశాల వద్ద మోకాళ్లపై ప్రణమిల్లి శంకుస్థాపన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హోమం జరిగిన ప్రదేశం వద్దే మోకరిల్లి కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. అలాగే శంకుస్థాపనలో భాగంగా నవరత్నాలు పెట్టిన ప్రదేశాన్ని తిలకించారు.   

అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ఉద్దండరాయునిపాలెం బయలుదేరిన టీడీపీ అధినేత పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరకట్టమీద నుంచి కాకుండా అమరావతి ఉద్యమం సాగుతున్న గ్రామాల మీదుగా ఆయన ఉద్దండరాయునిపాలేనికి బయలుదేరారు. దీంతో చంద్రబాబును మల్కాపురం-వెలగపూడి జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌లు పోలీసులతో చర్చలు జరిపారు.

శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని తాము పవిత్రస్థలంగా భావిస్తున్నందున శాంతియుతంగా అక్కడకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. చర్చల అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను మాత్రమే ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

వీఐపీ వాహనం వెనుక ఉన్న ఎస్కార్ట్‌ వాహనాలను సైతం పోలీసులు ఆపేయడంతో జడ్‌ప్లస్‌ భద్రత వలయంలో ఉన్న కాన్వాయ్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎస్కార్ట్‌ సఫారి వాహనాలు మార్గమధ్యలో ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టి రహదారులను దిగ్బంధం చేశారు. 

click me!