
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పోలవరం ముంపు ప్రాంతాల (polavaram ) పర్యటనకు టీడీపీ అధినేత బయల్దేరనున్నారు. గురు, శుక్ర వారాల్లో ఆయన విలీన మండలాల్లో పర్యటించనున్నారు.
గురువారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని శివకాశిపురం, కుక్కునూరుల్లో పర్యటిస్తారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్‌లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. గురువారం రాత్రికి భద్రాచలంలోనే బస చేయనున్న ఆయన.. శుక్రవారం భద్రాద్రి శ్రీ సీతారామస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రెండో రోజూ పర్యటనలో భాగంగా ఏటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతుల గుట్ట, రేఖపల్లి గ్రామాల్లో పర్యటించి.. వరద బాధితులకు భరోసా కల్పించనున్నారు చంద్రబాబు .
ఇకపోతే... భద్రాచలాన్ని అనుకుని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు.. తమ గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కనీస సాయం అందడం లేదని.. అందుకే ప్రభుత్వంపై విలీన గ్రామాల ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. నమ్మకం కోల్పోవడంతోనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read:అందుకే వాళ్లు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
‘‘రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారు. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు అత్యంత దారుణం. కరెంట్ రాకపోవడంతో తాగడానికి, ఇళ్లు శుభ్రపరుచుకోవడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారు. వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్ల పై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు. వారం క్రితమే వరదలు తగ్గాయి అని ప్రకటనలు చేసిన మంత్రులు...మరి ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్దరించ లేకపోయారో చెప్పాలి.
జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారన్నమాట. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయి. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండి. ప్రభుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు, గాలి మాటలు పక్కన పెట్టి యుద్దప్రాతిపధికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.