వైసీపీ ప్రభుత్వం ఇసుకను కూడా కబ్జా చేస్తోంది.. దీక్షలో చంద్రబాబు

By telugu team  |  First Published Nov 14, 2019, 10:23 AM IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇసుక కొరత సమస్య ఏర్పడిందన్నారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు 12గంటల దీక్ష  చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. 12 గంటల పాటు దీక్షలో కూర్చోనున్నారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు దీక్ష నిర్వహిస్తున్నారు. 

AlsoRead ఇసుక కొరత: విజయవాడలో 12 గంటల దీక్షను ప్రారంభించిన చంద్రబాబు...

Latest Videos

చంద్రబాబు దీక్షకు జనసేన, లెఫ్ట్‌, ఆప్‌ సంఘీభావం తెలిపాయి. చంద్రబాబుకు దీక్షా ప్రాంగణం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు.

ఈ  సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా? అని నిలదీశారు. 

AlsoRead మెున్న సొంతపుత్రుడు, నిన్న దత్తపుత్రుడు, నేడు చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి ఫైర్...

సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారని వ్యాఖ్యానించారు. దాదాపు 35లక్షల మంది పూట తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు. 

తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే... కాలం చెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవ్వరూ నష్టపోలేదన్నారు. సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలనటం అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెపాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డాగా వైసీపీ తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో కావాలనే కృత్రిమ కొరతను సృష్టించారని ఆరోపించారు. ఇంత నష్టం, ఇంత కష్టం గతంలో ఎన్నడూ లేదని అన్నారు. ఐదు నెలల్లో 50 మంది కార్మికుల ఆత్మహత్యలు చరిత్రలో లేవన్నారు. ఇంకా అనేక మంది ఆత్మహత్యాప్రయత్నాలు చేశారని తెలిపారు. వేల మంది అప్పుల పాలయ్యారనీ, పనుల్లేక ఎన్నో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎత్తిచూపడానికే తాను గురువారం ఇసుక దీక్ష చేస్తున్నానని వివరించారు.

click me!