విశాఖలో ఆఫీసులు పెడితే డెవలప్‌మెంట్ కాదు: చంద్రబాబు

By Siva KodatiFirst Published Jan 20, 2020, 8:48 PM IST
Highlights

ఒక రాష్ట్రం-ఒక రాజధాని అన్నదే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 

ఒక రాష్ట్రం-ఒక రాజధాని అన్నదే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మూడు రాజధానుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారో చెప్పకుండా ఎక్కువ సమయం తనను వ్యక్తిగతంగా తిట్టేందుకు ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని తిట్లు తిట్టినా, ఎగతాళి చేసినా, నవ్వినా, విమర్శించినా రాష్ట్రం కోసం భరిస్తానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారని ఆయన గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పిందని.. అందులో 46 శాతం అమరావతివైపే మొగ్గుచూపిందని బాబు గుర్తుచేశారు.

శివరామకృష్ణన్ కమిటీలో మూడు రాజధానులు పెట్టమని ఉందా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ రాజధానికి పనికిరాదని చెప్పారా, విజయవాడ-గుంటూరు రాజధానికి ఉపయోగకరమని చెప్పారని బాబు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో రాజధానిని నిర్ణయించలేదని, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజధానిపై నిర్ణయం తీసుకుంటాయని కమిటీ చెప్పినట్లు బాబు ప్రస్తావించారు.

రాగద్వేషాలకు అతీతంగా భవిష్యత్ తరాల కోసం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించామని చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం కోర్టుకు వెళ్లే మాట్లాడితే వినే స్థితిలో తాను లేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో ఎవరు రాజధానిని మార్చాలని అనుకోలేదని ఒక్క జగన్‌కే అలాంటి ఆలోచన వచ్చిందని బాబు ఎద్దేవా చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిసున్నప్పటి నుంచి ఢిల్లీ దేశ రాజధానిగానే కంటిన్యూ అవుతుందని చంద్రబాబు తెలిపారు.

కర్నాటక, ఆంధ్ర, తమిళనాడు కలిసున్నప్పటి నుంచి మద్రాస్ రాజధానిగా ఉందన్నారు. రాజధానుల వల్ల అభివృద్ది జరగలేదని, అభివృద్ధి చేయాలని చేస్తేనే ఇది జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ రాజధాని కావడం వల్ల రాయలసీమ ప్రజలు 21 గంటల పాటు ప్రయాణించాల్సి వుంటుందన్నారు. విశాఖలో ఆఫీసులు పెట్టినంత మాత్రాన పక్క జిల్లాలు అభివృద్ధి చెందవన్నారు. 

click me!