
కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రైతులకు పంట బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లభించడం లేదని.. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి ఒక్కో రైతుకు రూ. 13,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Also Read:ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని ముంచాడు: చంద్రబాబు
రాయలసీమలో రాయితీపై పంపిణీ చేసే డ్రిప్, యంత్ర పరికరాలను నిలిపివేశారని ప్రతిపక్షనేత మండిపడ్డారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం సీఎం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటూనే సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్టు పెట్టకుండా కాపాడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.