
కొందరు అసమర్థులు దొంగల మాదిరిగా తనపై రాయి విసిరారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. తన పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాలు ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని.. పులివెందుల రాజకీయాలు చేయొద్దని జగన్‌ను కోరారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని.. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేది టీడీపీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఇసుక, మద్యం కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సాగనంపడం ఖాయమని టీడీపీ చీఫ్ జోస్యం చెప్పారు. సాగు మోటార్లకు మీటర్లు అంటే రైతుల మెడకు ఉరితాడేనని ఆయన హెచ్చరించారు.
విభజన జరిగిన తరువాత రాష్ట్రాన్ని గాడిన పెట్టానని... తనది విజన్, వైసిపిది విధ్వంసమన్నారు. హైదరాబాద్‌లో నాడు వేసిన ఫౌండేషన్‌తో సంపద సృష్టి జరిగిందని... దీని వల్ల పేదలు లబ్ది పొందే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆయన దుయ్యబట్టారు. నందిగామలో ఎమ్మెల్యే, సోదరులు ఇసుకలో దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 1000 కంటే ఎక్కువ ఖర్చు అయితే వైద్యం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు..ఎక్కడైనా అమలు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు.
ALso REad:చంద్రబాబుపై దాడి .. ఆయన కనుసైగ చేస్తే తట్టుకోలేరు, ఎగిరిపడితే బడిత పూజే : జగన్‌కు అచ్చెన్న వార్నింగ్
జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా....కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మాత్రం మార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలు ఉంటే మేం తొలగించామా...తాము ఆనాడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఎలా ఉండేదిని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జగన్ కోడికత్తి లాంటి డ్రామాలు చాలా ఆడుతాడని..మనం అలెర్ట్ గా ఉండాలని చంద్రబాబు టీడీపీ కేడర్‌కు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలను కోరారు.
కాగా... ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు షోలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.