
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నది మన నినాదమన్నారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). ఒంగోలులో జరుగుతున్న మహానాడులో (mahanadu) ఆయన మాట్లాడుతూ.. ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రజలు సభకు రాకుండా అడ్డుకోవాలనిన చూశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడోపేడో తేల్చుకుందామని మీరంతా ఇక్కడికి వచ్చారని ఆయన కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. టీడీపీ వెంట ప్రజలున్నారని.. వైసీపీ (ysrcp) వెంట బస్సులున్నాయని చంద్రబాబు సెటైర్లు వేశారు.
ఈ రోజు జగన్‌కు నిద్ర రాదని.. వాళ్ల మీటింగ్‌లు వెల వెల, మన మీటింగ్‌లు కళ కళ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ రికార్డును ఎవరూ బద్ధలు కొట్టలేరని.. అఖండ సినిమాపైనా ఆంక్షలు పెట్టారని చంద్రబాబు ఫైరయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అఖండ సినిమా బాగా ఆడిందని ఆయన గుర్తుచేశారు. సినిమా వాళ్లను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇకపై జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని.. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏం నష్టం జరిగిందో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read: NTR Jayanti: వాళ్లకు బస్సులు ఉంటే.. మాకు జనాలు ఉన్నారు: చంద్రబాబు నాయుడు
నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారం పెంచేశారని.. సీఎం జగన్ ఒక ఉన్మాది, చేతకాని దద్దమ్మ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు ఎక్కువని టీడీపీ అధినేత మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలే కాదు.. కూరగాయల ధరలూ భారీగా పెరిగిపోయాని చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితి రానివ్వకూడదని.. రౌడీల గుండెల్లో నిద్రపోయిన పార్టీ టీడీపీ అని ఆయన గుర్తుచేశారు. సంక్షేమానికి నాంది పలికింది ఎన్టీఆరేనని ఆయన పేర్కొన్నారు.
జగన్‌వి అన్నీ మోసకారి సంక్షేమ కార్యక్రమాలంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని ఆయన దుయ్యబట్టారు. డబ్బు మొత్తం జగన్ జేబులోకి వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అని చెప్పి.. ఇప్పుడు అన్నీ నాసిరకం బ్రాండ్‌లు తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం ద్వారా ఏడాదికి జగన్‌కి రూ.5 వేల కోట్లు వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు.