
అన్ని ఎంక్వైరీ చేయిస్తానని... జగన్ (ys jagan) అవినీతిని కక్కిస్తానని టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) హెచ్చరించారు. ఈ మూడేళ్లలో జగన్ అవినీతి సంపాదన లక్షా 75 వేల కోట్లని చంద్రబాబు ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైసీపీకే ఉరేయాలని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలని.. భూముల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు తమ భూములను కాపాడుకోవాలని ఆయన సూచించారు. బాదుడే బాదుడులో వచ్చిన సొమ్ము ఎక్కడికి పోయిందని చంద్రబాబు ప్రశ్నించారు.
బాబాయిని చంపి గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మించాలని చూశారని ఆయన దుయ్యబట్టారు. జగన్‌కు రోషముంటే బాబాయ్‌ని చంపిన వారిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని నాశనం చేశారని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్ట్‌తో పాటు ప్రకాశం జిల్లాలో వున్న అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ రోడ్లు బాగు చేయకపోయినా మీరు నిలదీయడం లేదంటూ ప్రజలను ప్రశ్నించారు.
Also Read:ఏపీకి శ్రీలంక పరిస్ధితి వద్దు.. జగన్ పాలన అంతం కావాల్సిందే: మహానాడులో చంద్రబాబు
రోడ్లు నాగరికతకు చిహ్నమని.. వాజ్‌పేయ్ హయాంలో రోడ్లకు పెద్దపీట వేసేలా చేసిందని టీడీపీయేనని ఆయన గుర్తుచేశారు. కోడికత్తి కేసు ఏమైపోయిందన్న చంద్రబాబు .. కోడికత్తితో జగన్ డ్రామాలు ఆడారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా.. అసలు రాష్ట్రంలో రోడ్లు వున్నాయని జగన్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని.. మీడియాకు కూడా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
సంస్కరణలు తీసుకొచ్చి అందరి చేతిలో సెల్‌ఫోన్ వుండేలా చేశానని.. సెల్‌ఫోన్ ఆయుధంగా సామాజిక ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పి చివరికి కండీషన్లు పెట్టారని.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారని.. అమరావతి పోవడం వల్ల రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చంద్రబాబు దుయ్యబట్టారు.