అమరావతే రాజధాని.. విశాఖను అభివృద్ధి చేస్తా : మూడు రాజధానులపై తేల్చేసిన చంద్రబాబు

By Siva KodatiFirst Published May 5, 2022, 7:02 PM IST
Highlights

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అధికార వైసీపీకి కౌంటరిచ్చారు చంద్రబాబు నాయుడు. అమరావతిని రాజధానిగా చేసి తాను విశాఖను అభివృద్ధి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఏపీలో మూడు రాజధానులను (ap three capitals) ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా (visakhapatnam executive capital) మార్చాలని ఆయన కృతనిశ్చయంతో వున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని రాజధానిని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఏ వూరికైనా, ఏ ఇంటికైనా తాను వెళ్లగలనని... తనను అడ్డుకుంటే ఖబడ్దార్ అంటూ ఆయన హెచ్చరించారు. అత్యాచారాలపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని.. తల్లులది తప్పైతే జగన్‌ను పెంచిన తల్లిని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. పదో తరగతి పేపర్ లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ చీఫ్ నిలదీశారు. పేపర్ లీక్ వెనుక వైసీపీ హస్తం వుందని ఆయన ఆరోపించారు. పేపర్లు లీక్ అవుతుంటే మంత్రి బొత్స ఏం చేస్తున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు.  

Latest Videos

అంతకుముందు చంద్రబాబు గురువారం విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో చూస్తున్నానని చెప్పారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ అభివృద్ది గురించి ఏం చేయాలని ఆలోచిస్తే.. జగన్ మాత్రం విధ్వంసం ఎలా చేయాలో చేసి చూపించాడని మండిపడ్డారు. 30 ఏళ్లలో ఎవరూ చేయని విధ్వసం జగన్ రెడ్డి మూడేళ్లలో చేశారని మండిపడ్డారు. 

ప్రజావేదికతో కూల్చివేతతో మొదలైన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. గంజాయి రాష్ట్రానికి చిరునామాగా మార్చారని ఆరోపించారు. జగన్ అప్పులు చేసుకుంటూ పోతున్నారని.. అవి ఎవరూ కట్టాలని ప్రశ్నించారు. జగన్‌ది ఐరన్ లెగ్ అని.. అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. జగన్ ఊరికో సైకోను, రౌడీని తయారు చేశారని ఆరోపించారు. ఈ సైకోల నుంచి కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. సైకోలను అణచివేసి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆ శక్తి తనకు దేవుడు ఇచ్చాడని చెప్పారు. 

పార్టీకి ఆర్థికంగా సాయం చేసిన, క్షేత్ర స్థాయిలో పనిచేసిన, పార్టీకి ఆలోచన విధానంలో సహాయం చేసిన వారందరినీ పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తల, నాయకుల పనితనాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటామని చెప్పారు. భవిష్యత్ కోసం అందరం పనిచేద్దామని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. 

click me!