
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారాల ఘటనల నేపథ్యంలో టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించిన చంద్రబాబు... అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలకు ఏపీ డీజీపీ (ap dgp) రాజేంద్రనాథ్ రెడ్డి (rajendranath reddy) కౌంటరిచ్చారు. రాష్ట్రంలో జరిగిన ఒకట్రెండు ఘటనలను చూపుతూ ఏపీలో అసలు శాంతి భద్రతలే లేవంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రంలో గంజాయి కట్టడికి పూర్తి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.
అంతకుముందు జగన్ సర్కార్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ కాస్త నరకాంద్ర ప్రదేశ్ గా మారిందని చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులకు సంబంధించి 31 ఘటనలు జరగడం. 26 మంది రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో దుస్థితికి అద్దంపడుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.
పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమై ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆయన పార్టీ నేతలతో పంచుకున్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని... అసలు వ్యవసాయ శాఖ అనేది ఉందా అనే అనుమానం కలిగేలా పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. నెలలో 26 మంది రైతుల బలవన్మరణాలు జరిగినా... ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలు, అసమర్థత కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిందని టీడీపీ అధినేత అభిప్రాయ పడ్డారు. ఈ కారణంగా ఉపాధి కోసం యువత, ఆయా వర్గాల ప్రజలు వలసపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిణామం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మహిళలపై దాడులు -నేరాలు, వ్యవసాయ రంగం సంక్షోభం – రైతుల ఆత్మహత్యలపై పార్టీ పరంగా రెండు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వర్గాల సమస్యలు, పోరాటం, పరిష్కారం కమిటీ సూచనల ఆధారంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.