
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై స్పందించిన చంద్రబాబు.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జగన్ తీరు చూస్తుంటే ఏపీలో రాజ్యసభకు అర్హులైన వారు కనిపించలేదా అని ప్రశ్నించారు.
ఏపీలో సమర్థులు, మంచివారు లేనట్లు కొందరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, ఆయనతో కేసుల్లో ఉన్నవారికి సీఎం రాజ్యసభ అభ్యర్థితత్వం ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు అన్నారు. తప్పులు ఎత్తిచూపితే ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పిందన్నారు. నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. సమస్యలు చెప్పేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఒంగోలులో టీడీపీ మహానాడుకు స్టేడియం ఎందుకివ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని.. ఇక వారిని ఎవరూ ఆపలేరని అన్నారు. జగన్ లాంటి నియంతలకు తాను భయపడనని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ దోపిడిని, అరాచకాలను వివరించాలని కోరారు.