హైదరాబాద్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, సీట్లు, ఉమ్మడి ప్రచారం , మేనిఫెస్టో, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా , వద్దా తదితర అంశాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదల కావడంతో తిరిగి రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నారు. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన ఆయన వారిలో ధైర్యం నింపారు. అయితే ఎన్నికలకు మూడు నెలలకు మించి సమయం లేకపోవడంతో పొత్తులు, సీట్ల ఖరారు, ప్రచారం, అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లడంతో తదుపరి కార్యక్రమాల్లో ముందడుగు పడలేదు. ఇప్పుడు పరిస్ధితులు కుదటపడటంతో జనసేనతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై టీడీపీ చీఫ్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటి వరకు చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు వెళ్లి చర్చలు జరిపివచ్చారు. ఈసారి మాత్రం పవన్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, సీట్లు, ఉమ్మడి ప్రచారం , మేనిఫెస్టో, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా , వద్దా తదితర అంశాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ALso Read: సీట్ల బేరాలు మొదలు : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ , జనసేన డిమాండ్లు ఇవే.. బంతి టీడీపీ కోర్టులో
ఈ పొత్తు లెక్కలపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చ జరగ్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది మాత్రం తెలియరాలేదు. 40 నుంచి 42 వరకు పవన్ కళ్యాణ్ సీట్లు అడుగుతుండగా.. 25 నుంచి 30 వరకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం తెలిపినట్లుగా మీడియా కథనాల సారాంశం. అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంట్ స్థానాలను జనసేనాని తమకు ఇవ్వాలని కోరుతుండగా.. టీడీపీ మాత్రం 2 ఇచ్చేందుకు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల విశాఖలో జరిగిన బహిరంగ సభలో సీఎం పదవి, టీడీపీతో పొత్తు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనని, ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చని ఆయన పేర్కొన్నారు. సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మేం టీడీపీ వెనుక నడవటం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నీ ప్రజలకు చెప్పేచేస్తామని.. మీ ఆత్మగౌరవం ఎప్పుడూ తగ్గించనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలయన్స్ తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదని పవన్ వెల్లడించారు. మేం ఎవరికీ బీ పార్టీ కాదని, నన్ను నేను తగ్గించుకొనైనా మిమ్మల్ని పెంచడానికి తాను సిద్ధమని జనసేనాని స్పష్టం చేశారు. డొంక తిరుగుడు పనులు చేయనని, ఎవరు తనతో వచ్చినా రాకున్నా తాను నడుస్తూనే వుంటానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.