ఈసారి పులివెందులలో టీడీపీదే విజయం : కమలాపురంలో చంద్రబాబు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 19, 2024, 9:13 PM IST

కడప జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. శుక్రవారం ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు.


కడప జిల్లాలో జగన్ ఒక్కడికే న్యాయం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. శుక్రవారం ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో అన్ని సీట్లలో వైసీపీనే గెలిపించారని, మరి ఒక్కరికైనా జగన్ న్యాయం చేశారా అని చంద్రబాబు నిలదీశారు. జగన్‌తో పాటు ఇద్దరు , ముగ్గురు బాగుపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. 

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. కడప జిల్లాలో 35 మండలాలు దుర్భిక్షంలో వున్నాయని, 20 ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ కరువు మండలాలను జగన్ ప్రకటించడం లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అని కథలు చెప్పి, ముద్ధులు పెట్టి.. ఇప్పుడు గుద్ధులు గుద్ధుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తనకు తండ్రి లేడు, బాబాయి లేడని గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ వద్దన్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

Latest Videos

సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారని.. ఏ తప్పూ చేయని కోడికత్తి శ్రీను జైల్లో వున్నాడని, బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హూ కిల్డ్ బాబాయి అన్న దానికి జగన్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చామని.. రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు అందుబాటులో వుంచామని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ పాలనలో నాణ్యమైన మద్యం రూ.60కి విక్రయిస్తే ఇప్పడు నాసిరకం మద్యం రూ.250కి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి, చివరికి చెత్తపైనా పన్ను వేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

రాయలసీమకు మొట్టమొదటిసారిగా నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని.. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్వింది ఎన్టీ రామారావేనని చంద్రబాబు గుర్తుచేశారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని.. జగన్ రాయలసీమ ద్రోహి అని .. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీల నీటిని సీమకు మళ్లించామని ఆయన తెలిపారు.  రిబ్బన్‌లు కట్ చేయడం, రంగులేయడం, పథకాలకు పేర్లు పెట్టుకోవడం తప్పించి పని మీద శ్రద్ధ లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీకి పాలన ఎలా చేయాలో, సంపద ఎలా సృష్టించాలో, పేదవాడికి ఎలా న్యాయం చేయాలో తెలుసునని .. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు. 

click me!