175 స్థానాలూ మావే.. పులివెందులలోనూ టీడీపీదే విజయం: జగన్‌కు చంద్రబాబు సవాల్

By Siva KodatiFirst Published Sep 20, 2022, 9:42 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. 175 స్థానాల్లోనే కాదు.. పులివెందులలోనూ గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. పులివెందుల బాంబులకు భయపడేవారు ఎవరూ లేరని చంద్రబాబు స్పష్టం చేశారు

వైసీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం చిత్తూరు జిల్లా జైలులో వున్న టీడీపీ నేతల్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నేర చరిత్రపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా పనిచేస్తోన్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు జైలుకు వెళ్లి పరామర్శించలేదని.. కానీ ఇవాళ జైలులో వున్న వారిని పరామర్శించాల్సి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

కుప్పంలో అన్న క్యాంటీన్‌ను అడ్డుకుని తమ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని.. జగన్‌ను కూడా తరిమికొట్టే రోజు వస్తుందని టీడీపీ అధినేత జోస్యం చెప్పారు. 175 స్థానాల్లోనే కాదు.. పులివెందులలోనూ గెలుస్తామని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ సంపద సృష్టిస్తే.. వైసీపీ విధ్వంసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బాంబులకు భయపడేవారు ఎవరూ లేరని... ప్రజల కోసం పోరాడే పార్టీ మాదని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల్లో 90 శాతం మంచివాళ్లేనని.. 10 శాతం మందితోనే తమకు సమస్య అన్న ఆయన వాళ్లని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 

Also REad:నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో వరుస రివ్యూలు.. పనితీరును బట్టే టిక్కెట్లు : తేల్చిచెప్పేసిన చంద్రబాబు

ఇకపోతే.. ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ఆయన గత కొన్నిరోజులుగా ముఖాముఖీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు పాణ్యం, బనగానపల్లి, ఏలూరు నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో రివ్యూలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి గౌరు చరితారెడ్డి, బిసి జనార్థన్ రెడ్డి, బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఇప్పటి వరకు 46 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీలు ముగిశాయి. పార్టీ ఇంచార్జ్ పనితీరుపై భేటీలలో ప్రధాన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తమ వద్ద ఉన్న సమాచారం, నివేదికల అధారంగా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై స్థానికంగా ఇంచార్జ్ చేస్తున్న పోరాటంతో పాటు...పార్టీ కార్యక్రమాల నిర్వహణపరంగా ఉన్న ఫీడ్ బ్యాక్‌పై చర్చలు జరిపారు. మూడు నెలల తరువాత పనితీరును విశ్లేషించి టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు నేతలకు తేల్చిచెప్పారు.    

ఇకపోతే.. వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గత గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరి, సీఎం ప్రసంగం తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. 

click me!