
తెలుగుదేశం పార్టీ (telugu desam party) సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి (bojjala gopala krishna reddy) టిడిపి (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బొజ్జల కోలుకుని ఇంట్లోనే ఉంటున్నారు. శుక్రవారం బొజ్జల పుట్టిన రోజు కావడంతో చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని బొజ్జల ఇంటికి వెళ్లి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. బొజ్జల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. బొజ్జలకు కేక్ తినిపించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుకుని... జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చంద్రబాబుకు మంచి అనుబంధమే ఉంది. చివరిసారిగా తన కేబినెట్లో ఉన్నప్పుడు మధ్యలోనే ఉద్వాసన పలికిన చంద్రబాబు చాలా కాలం తర్వాత తిరిగి బొజ్జలను పలకరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఇంటికే పరిమితం అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్ లోనే తన పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు తనను పరామర్శించడానికి రావడంతో బొజ్జల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను చూడగానే చేతులు జోడించి అలాగే ఉండిపోయారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు ఆయన చేతులు జోడించే ఉన్నారు.