
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావాలని టీడీపీ, జనసేన భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు పలుమార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. కానీ అటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే కొద్దిరోజుల నుంచి మాత్రం బీజేపీ నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా పవన్, చంద్రబాబులకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వారిద్దరూ హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పొత్తు అంశంపై అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పొత్తులపై శుక్రవారం లోగా క్లారిటీ వస్తుందని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.