లైన్‌మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ.. ‘క్రైమ్ సిటీగా విశాఖ’

By telugu teamFirst Published Nov 6, 2021, 5:12 PM IST
Highlights

విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న బంగార్రాజు హత్యోదంతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. ఈ హత్యలో అధికార పార్టీ నేతల ప్రమేయమున్నదనే ఆరోపణలు రావడంతో చర్చ తీవ్రమైంది. ఈ హత్యపైనే తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. వెంటనే హత్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 

అమరావతి: విశాఖ జిల్లాలో విద్యుత్ ఉద్యోగి లైన్‌మెన్ బంగార్రాజు Murder కలకలం రేపుతున్నది. మంత్రి బొత్స నారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం సమీపంలో Dead Body లభ్యమవ్వడంతో అధికార పార్టీ YCPపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ మంత్రి పరామర్శించడానికి రాలేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. బాధితులు మంత్రులకు వ్యతిరేకంగానూ నినాదాలు చేశారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తితో మంత్రి మేనల్లుడు లక్ష్మణరావుకు సంబంధాలున్నాయనే చర్చ జరుగుతున్నది. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసే వరకు పోస్టు మార్టం నిర్వహించనివ్వబోమని కుటుంబ సభ్యులు అన్నారు. ఈ హత్యోదంతం తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలోనే TDP చీఫ్ Chandrababu Naidu డీజీపీ గౌతం సవాంగ్‌కు Letter రాశారు.

విశాఖపట్నం జిల్లా ప్రశాంతతకు మారుపేరుగా ఉండేదని DGP Gautam Sawangకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ, నేడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అక్రమ భూకబ్జాలు, హత్యలతో ఆ జిల్లా క్రైమ్ సిటీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేసిన బీసీ యాదవ కులానికి చెందిన బంగార్రాజు దారుణ హత్యకు గురయ్యారని అన్నారు. ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైందని వివరించారు.

బంగార్రాజు మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా పోస్టుమార్టం నిర్వహించకపోవడం విచారకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బంగార్రాజు భార్య నందిని కనీసం ఓదార్చలేని స్థితిలో ఉన్నదని వివరించారు. వారి ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.

Also Read:ఆంధ్రప్రదేశా? అదానీ ప్రదేశా?.. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ దారాదత్తం చేస్తున్నాడు.. శైలజనాథ్ మండిపాటు..

హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం వహిస్తున్నారని, ఇది విశాఖపట్నం శాంతి భద్రతల సమస్య మరింత పెరిగేందుకు దోహదం చేస్తుందని చంద్రాబాబు వివరించారు. బంగార్రాజు హత్యలో అధికార వైఎసీపీకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే పోలీసులు ఈ కేసులో ముందడుగు వేయడానికి జంకుతున్నారని వివరించారు. ఇదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నదని తెలిపారు. పోలీసులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

డబ్బులిస్తామని పిలిపించి తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేశారంటూ బంగార్రాజు భార్య నందిని కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని, నిందితులిద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి పేర్లు రాసి ఇక్కడే చచ్చిపోతామనీ అన్నారు. నిందితులను అరెస్టు చేయాలనేదే తన డిమాండ్ అని కేజీహెచ్ దగ్గర ఆమె విలపించారు.

Also Read: ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవీయత.. ఆటో దగ్గరకెళ్లి వృద్ధుడి పెన్షన్‌ పునరుద్ధరణకు ఆదేశాలు

బంగార్రాజు కుటుంబానికి న్యాయం చేయాలని పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు వచ్చారు.

గత ఆదివారం సాయంత్రం నుంచి బంగార్రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భీమునిపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మృతదేహం బుధవారం లభ్యమైంది.

click me!