దళితుల సంక్షేమం కోసం వైసీపీ ఏం చేసిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాల గురించి వివరించాలని చంద్రబాబు కోరారు.
అమరావతి: దళితుల కోసం ఒక్క ప్రత్యేకమైన పథకం తెచ్చారా అని చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. తమప్రభుత్వ హయంలో దళితుల కోసం 23 ప్రత్యేక పథకాలు తీసుకువచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు. తాము తీసుకువచ్చిన పథకాలను జగన్ ఎత్తివేశారని ఆయన ఆరోపించారు.
దళిత సంక్షేమంపై టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై టీడీపీలోని దళిత నేతలు శుక్రవారంనాడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన జీవోల గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఎస్టీ రిజర్వేషన్లను 14 నుండి 15కు , ఎస్సీ రిజర్వేషన్లను 4 నుండి ఆరు శాతానికి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
undefined
బాలయోగిని లోక్‌సభ స్పీకర్ గా నియమించిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు చెప్పారు. కేఆర్ నారాయణ్ ను రాష్ట్రపతిగా తాను ప్రతిపాదంచినట్టుగా చంద్రబాబు తెలిపారు. దళిత నేత మహేంద్రనాథ్ ఆర్ధికమంత్రిని చేసిన ఘనత టీడీపీదేనన్నారు. కాకి మాధవరావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన చరిత్ర టీడీపీదేనని చంద్రబాబు చెప్పారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నియమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో వైపు 2001లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు తెలిపారు.
దళితులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లను అమలు చేసినట్టుగా చంద్రబాబు వివరించారు. దళితులకు భూమి కొనుగోలు చేసే పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దళితుల కోసం ప్రత్యేక గురుకులాలను ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్‌దేని చంద్రబాబు చెప్పారు. దళితుల సంక్షేమాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్‌సీ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. ఎస్‌సీలకు సబ్ ప్లాన్ పెట్టడమే కాదు అమలు చేసి చూపినటటుగా చంద్రబాబు తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యాపథకం తీసుకువచామన్నారు. ఈ పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తాను దళితులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈవిషయమై ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడికి దిగారన్నారు. తాను దళితులపై వ్యాఖ్యలు చేశానని తప్పుడు ప్రచారంపై చంద్రబాబు మండిపడ్డారు. గతంలో కూడా తాను వ్యవసాయం దండగ అని చెప్పినట్టుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. వ్యవసాయంపైనే ఆధారపడవద్దని కోరానన్నారు. దళితుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.