కుప్పంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్... నేటి నుండి మూడురోజులు అక్కడే, పర్యటన వివరాలివీ...

By Arun Kumar PFirst Published Jan 6, 2022, 12:27 PM IST
Highlights

తన సొంత నియోజకవర్గంలో టిడిపి బలహీనపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం కుప్పంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టిన ఆయన తరచూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంతోనే ఇవాళ్టినుండి మూడురోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)  సొంత నియోజకవర్గం కుప్పం (kuppam) పర్యటన ఖరారయ్యింది. ఇవాళ్టి (గురువారం) నుండి మూడురోజుల పాటు ఆయన కుప్పానికే పరిమితం కానున్నారు.

ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో టిడిపి (TDP) కంచుకోట కుప్పంలో వైసిపి (YSRCP) జెండా ఎగిరింది. దీంతో జాగ్రత్తపడ్డ చంద్రబాబు తరచూ కుప్పంలో పర్యటిస్తూ టిడిపి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి (గురువారం) నుండి మూడు  రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 

ఇప్పటికే కుప్పం బయలుదేరిన చంద్రబాబు మరికొద్దిసేపట్లో దేవరాజపురం చేరుకోనున్నారు. అక్కడ టిడిపి నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.  ఆ తర్వాత రామకుప్పం మండలం ఆరిమానుపెంట, వీర్నమల, వీర్నమల తాండా, గట్టూరు తాండా, ననియాల, నారాయణపురం తాండా, సింగసముద్రం, కెంచనబల్ల గ్రామాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. రాత్రి తిరిగి కుప్పం చేరుకుని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌ లో బస చేయనున్నారు. 

read more  రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది: పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు

ఇక శుక్రవారం ఉదయం 10గంటలకు కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో ఎన్టీఆర్‌ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటును చంద్రబాబు ప్రారంభించనున్నారు. మద్యాహ్నం దాసేగానూరు గ్రామానికి చేరుకుని ఓవర్‌హెడ్‌ ట్యాంకు తనిఖీ చేపట్టనున్నారు.  ఆ తర్వాత కుప్పం మండలం గుట్టపల్లె క్రాస్‌ లో నిర్మించిన కొత్తఇండ్లను పరిశీలించనున్నారు. అక్కడినుండి చందం, నూలుకుంట, ఎన్‌.కొత్తపల్లె, గరిగచీనేపల్లె, మిట్టపల్లె, వేపూరు గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాలకగొననున్నారు. రాత్రి తిరిగి కుప్పం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 

ఇక మూడోరోజయిన శనివారం ఉదయం గుడుపల్లె మండలం శెట్టిపల్లె, జాతికర్తనపల్లె,  శాంతిపురం మండలం వెంకటాపురం, సోమాపురం, చిన్నూరు గ్రామాలు, సి.బండపల్లె, 64-పెద్దూరు, గెసికపల్లె, సోలిశెట్టిపల్లె గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. అనంతరం ఆయన కుప్పంకు చేరుకుని అక్కడినుండి తిరుగుపయనం కానున్నారు. 

read more  సీఎం గారూ... పోలవరం నిర్వాసితులకు ఆదుకొండి..: జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ

ఇలా మూడురోజుల పాటు సొంత నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వెళ్ళి టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు చంద్రబాబు. కుప్పంలో వైసిపి బలపడతున్న నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు.

గతేడాది నవంబర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. 

 కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చంద్రబాబు కంచుకోటలో జెండా ఎగరవేయాలని అధికార వైసీపీ భావించింది. ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

click me!