Cyclone Gulab: టిడిపి శ్రేణులు సాయానికి ముందుకురావాలి: చంద్రబాబు పిలుపు

By Arun Kumar PFirst Published Sep 27, 2021, 4:45 PM IST
Highlights

గులాబ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తోచిన సాయం చేయాలని టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. 

గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని చంద్రబాబు సూచించారు. 

''గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది'' అన్నారు చంద్రబాబు. 

''తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలి. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలి. వారికి అన్ని విధాల అండగా నిలవాలి'' అని చంద్రబాబు సూచించారు. 

''గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలి'' అని చంద్రబాబు సూచించారు. 

read more  Cyclone Gulab:భారీ వర్షాలు...వరదనీటితో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్లమార్గం(వీడియో)

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పాలకొల్లు, నరసాపురం,జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాల్లో ఎడతెరిని లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం వద్ద జల్లేరు వాగు వరదనీటితో పోటెత్తింది. దీంతో ఇటీవలే రూ.60 లక్షలతో నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోయి పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

 కృష్ణా జిల్లాలో కూడా తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. అయితే గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో కైకలూరు మండలం ఆటపాక వద్ద జాతీయ రహదారిపై చెట్టు  విరిగిపడింది. దీంతో కైకలూరు - ఆకివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయి భారీ ట్రాపిక్ జాం ఏర్పడింది.

 గుంటూరులో ఉదయం ఐదు గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్స్ లేకా రహదారులు వర్షపునీటితో మునిగింది. మునిసిపల్ కమిషనర్ బంగ్లా వద్ద రోడ్డుపైనే మురికినీరు నిలిచిపోయింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వర్షపునీరు చేరింది. డొంకరోడ్డు, శ్రీనగర్, ఆరండల్ పేట, ఏటి అగ్రహారం చెరువులుగా మారాయి. వాహనాదారులు, ప్రజలు అటువైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

తుఫాను తీరం దాటిన శ్రీకాకుళం జిల్లాతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుందని... మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరిస్తున్నారు. 


 

click me!