బ్యాంకులపై ప్రజలు తిరగబడతారా

First Published Dec 20, 2016, 1:11 AM IST
Highlights

ప్రజలు బ్యాంకులపై తిరగబడతారని కూడా జోస్యం చెప్పారు. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.

కరెన్సీ సంక్షోభం పెరుగుతున్న కొద్దీ బ్యాంకులను బలిపశువులను చేసే కార్యక్రమం మొదలైనట్లే ఉంది. ప్రజాగ్రహం తమవైపు రాకుండా ఉండేందుకు టిడిపి ప్రభుత్వం బ్యాంకులపైకి నెట్టేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాన్ని టిడిపి రోజు రోజుకూ పెంచుతోంది.

 

ప్రజావసరాలను తీర్చటంలో ఆర్బిఐ నుండి అవసరమైన డబ్బును రాష్ట్రానికి తెప్పించంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కనబడుతోంది.

 

బ్యాంకులపైకి నెపాన్ని నెట్టేసే ప్రయత్నాలను ముందుగా చంద్రబాబునాయడు మొదలుపెట్టారు. తాజాగా మంత్రులు అందుకున్నారు. బ్యాంకులు డబ్బులు ఇవ్వకపోవటం వల్లే జనాలు ఇబ్బంది పడుతున్నారంటూ చంద్రబాబు ఆమధ్య బ్యాంకులపై మండిపడ్డారు.

 

పెద్ద నోట్లు రద్దైన దగ్గర నుండీ కొత్త కరెన్సీని ఆర్బిఐ జాతీయ బ్యాంకులకు చాలా తక్కువగా సరఫరా చేస్తోంది.

 

అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులు హెడ్ఎఫ్సీ, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకులకు మాత్రం వందల కోట్లు సరఫరా అవుతున్నది. అయితే, రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉన్నది జాతీయ బ్యాంకులే. దాంతో ప్రజలందరూ జాతీయ బ్యాంకుల మీదే పడుతున్నారు. నిజానికి కరెన్సీ సంక్షోభంలో బ్యాంకుల పాత్ర చాలా పరిమితమే.

 

 

తమకు వస్తున్నదే చాలా తక్కువ డబ్బు కాబట్టి వచ్చిందాన్నే వీలైనంత మంది ఖాతాదారులకు పంపిణీ చేసే ఉద్దేశ్యంతో కొద్ది మొత్తాలను మాత్రమే జాతీయ బ్యాంకులు అందిస్తున్నాయి. దాంతో అవసరాలకు సరిపడా డబ్బులు అందక ఖాతాదారుల ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.

 

వాస్తవం ఇలావుండగా, జనాలకు అవసరమైన డబ్బు అందించటంలో బ్యాంకులు విఫలమవుతున్నయని చంద్రబాబు మండిపడటంలో అర్ధం ఏమిటి?

 

సిఎంకు చేతనైతే ఆర్బిఐతో మాట్లాడి ప్రజావసరాలకు తగ్గట్లుగా డబ్బును తెప్పించాలి. ఆ విషయంలో విఫలమైన చంద్రబాబు బ్యాంకులపై మండిపడితే ఉపయోగం లేదు. పైగా బ్యాంకు సిబ్బందిపై ఒత్తిడి పెంచినట్లవుతోంది. ఆ అసహనం, ఆగ్రహంగా మారి తన ప్రభుత్వంపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని చంద్రబాబు ఆందోళన పడుతున్నారు.

 

ఆ ఆందోళనలో నుండి వచ్చిన ముందుచూపుతోనే బ్యాంకులను బలిపశువులుగా చేద్దామనుకుంటున్నట్లు కనబడుతోంది. తాజాగా చంద్రబాబు పాటనే మంత్రులు కూడా అందుకున్నారు. ఏలూరులో పర్యటించిన మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, బ్యాంకులు డబ్బులు ఇవ్వక పోవటం వల్లే రైతులు నాట్లు వేసుకోలేకపోతున్నట్లు ఆరోపించటం గమనార్హం.

 

అదేవిధంగా, బ్యాంకులు ప్రజలకు సహకరించటం లేదన్నారు. ప్రజలు బ్యాంకులు చుట్టూ తిరిగి అలసిపోతున్నట్లు మంత్రి చెప్పారు. ఇలాగైతే ప్రజలు బ్యాంకులపై తిరగబడతారని కూడా జోస్యం చెప్పారు. దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.

 

ఇదేవిధంగా పలువురు మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలు బ్యాంకులపై అసంతృప్తని వ్యక్తంచేస్తున్నారు. అంటే ఇక్కడ విషయమేమిటంటే భవిష్యత్తులో ప్రజాగ్రహాన్ని బ్యాంకులవైపు మళ్లించి తాము సేఫ్ గా ఉండాలన్నది టిడిపి ప్లాన్ గా కనబడుతోంది.

 

 

 

 

click me!