
గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు. వివరాలు.. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి పెయిడ్ ఆర్టిస్టును తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు.
అయితే ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్‌లో టీడీపీ బీసీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో టీడీపీ నేతలను అదుపుచేస్తుండగా.. చంద్రశేఖర్ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు.