జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్: అచ్చెన్నాయుడు తీవ్రమైన హెచ్చరిక

By telugu teamFirst Published Oct 1, 2021, 5:32 PM IST
Highlights

అనంతపురం జిల్లా పార్టీ నేతల తీరును టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనంతపురం జిల్లా పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ (TDP) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడి పేరు మీద విడుదలైన ప్రకటన అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అచ్చెన్నాయుడు ఆ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు. 

అనంతపుర జిల్లా టీడీపీ నాయకుల తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడి ప్రకటన వెలువడిందని భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటించవద్దని, అలా పర్యటిస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అచ్చెన్నాయుడు వ్యవహరించారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల పుట్టపర్తిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ ఇస్తూ హెచ్చరిక జారీ చేసినట్లు చెబుతున్నారు. కొంత మంది టీడీపీ నాయకులు ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వర్గాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.  

అనంతపురం జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులే ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాకుండా పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి నాయకులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే అచ్చెన్నాయుడి ప్రకటన వెలువడిందని భావిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణకు భంగం వాటిల్లకుండా చూడాలనేది ఆయన అభిమతంగా చెబుతున్నారు. మొత్తం మీద, జేసీ ప్రభాకర్ రెడ్డికి అచ్చెన్నాయుడి ప్రకటన మింగుడు పడే విధంగా లేదని అంటున్నారు. 

click me!