సీబీఐ అధికారులమంటూ రాయపాటికి బెదిరింపులు: తమిళ నటి కోసం సెర్చింగ్

By Siva KodatiFirst Published Jun 16, 2020, 8:50 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో తమిళనటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్లను నిందితులుగా గుర్తించారు.

తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో తమిళనటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్లను నిందితులుగా గుర్తించారు. మద్రాస్ కేఫ్, రెడ్ చిల్లీస్ సినిమాల్లో హీరోయిన్‌గా లీనా నటించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే లీనా అనుచరులు మణివర్థన్, సెల్వరామరాజ్, అర్చిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సీబీఐ గతేడాది కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:బ్యాంకులకు డబ్బులెగ్గొట్టిన 50 కంపెనీల్లో రాయపాటి ట్రాన్స్ టాయ్ కూడా.

పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఆయన తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.

అయితే ఇదే అదనుగా భావించిన డబ్బులు దండుకోవాలని తమిళ నటి లీనా మరియా పాల్, ఆమె భర్త, అనుచరులు ప్లాన్ గీశారు. అనుకున్నదే తడవుగా ఈ ఏడాది జనవరి 3న రాయపాటికి మరియాపాల్ అనుచరుల్లో ఒకడైన మణివర్ధన్ రెడ్డి సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశాడు.

తమకు డబ్బులిస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామని మాటలు చెప్పారు. ఆ తర్వాత నేరుగా గుంటూరు వెళ్లి రాయపాటిని కలిసి అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

దీనిపై అనుమానం రావడంతో రాయపాటి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ.... మణివర్థన్ రెడ్డితో పాటు మరో నిందితుడు రామరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:రాయపాటికి వల: సిబిఐ డైరెక్టర్ నాకు సన్నిహితుడు, తనకు జగన్ తెలుసు

ఈ మొత్తం కుట్రకు నటి లీనా మరియా పాల్, ఆమె భర్త సూత్రధారులుగా తెలిసింది. దీంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టి, పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా లీనాపై గతంలోనూ అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

తమిళ నేత టీటీవీ దినకరన్‌ను సైతం ఆమె బెదిరించినట్లుగా తెలుస్తోంది. అలాగే కేరళలో బ్యూటీపార్లర్ల పేరిట రూ.19 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో గతంలో ఆమె అరెస్టయ్యింది. రాయపాటికి బెదిరింపుల వ్యవహారంలో లీనా కోసం గాలిస్తున్న సీబీఐ వారిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. 

click me!