
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో మరో ఇద్దరిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అమరావతి మెడికల్స్ అధినేత పెనుమంచి శివరామమూర్తి, చిమ్మట వేణుగోపాల్‌ను అరెస్ట్ చేశారు.
వీరిద్దరూ ఈఎస్ఐ డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేశ్ బాబులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించి వీరి అండతో అమరావతి మెడికల్స్ నుంచి పెద్ద మొత్తంలో మందులు కొనుగోలు చేశారు డైరెక్టర్లు.
Also Read:ఈఎస్ఐ వ్యవహారం కాదు... అచ్చెన్నాయుడు అరెస్టుకు కారణమదే: నారా లోకేష్
కాగా ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు అధికారులు. దీంతో వారిద్దరికి న్యాయమూర్తి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. అనంతరం శివరామమూర్తి, వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ సర్వీసెస్ సేవల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఏసీబీ దర్యాప్తులో తేలింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి మొత్తం రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ నిర్ధారించింది.
Also Read:ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్.. (వీడియో)
ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి ఏపీ కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.