కరోనా బారిన కుటుంబం.. వారిని తలుచుకుంటూ వృద్ధురాలి మృతి

By telugu news teamFirst Published May 26, 2021, 11:32 AM IST
Highlights

 కనీసం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబసభ్యులకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తహసీల్దార్ ముందుకు వచ్చారు.

ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. దీంతో.. వారంతా కోవిడ్ సెంటర్ లో చేరారు. వారి ఇంట్లోని వృద్ధురాలికి మాత్రమే కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. తనవారంతా కరోనా బారిన పడటంతో.. ఆందోళన చెందిన వృద్ధురాలు ఇంట్లోనే కన్నుమూసింది. కనీసం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబసభ్యులకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తహసీల్దార్ ముందుకు వచ్చారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా గడివేముల మండలంకొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు  లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్‌ కేర్‌ సెంటరుకు తరలించారు.

అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్‌ కేర్‌ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్‌ నాగమణి దృష్టికి వెళ్లింది.

దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి  గ్రామానికి చేరుకున్నారు.  ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్‌ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు సహకరించారు. 

click me!