ఆనందయ్య మందుపై అధ్యయనంలో అవాంతరాలు: ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్

By narsimha lode  |  First Published May 26, 2021, 10:51 AM IST

 ఆనందయ్య మందు తీసుకొన్న  500 మంది నుండి సమాచార సేకరణలో వైద్య సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మందు వాడిన 500 మంది నుండి పాజిటివ్ రిపోర్టు వస్తేనే జంతువులపై ప్రయోగంతో పాటు క్లినికల్ ట్రయల్స్  దిశగా అడుగులు పడనున్నాయి.
 


నెల్లూరు:  ఆనందయ్య మందు తీసుకొన్న  500 మంది నుండి సమాచార సేకరణలో వైద్య సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మందు వాడిన 500 మంది నుండి పాజిటివ్ రిపోర్టు వస్తేనే జంతువులపై ప్రయోగంతో పాటు క్లినికల్ ట్రయల్స్  దిశగా అడుగులు పడనున్నాయి.ఐదు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. ఈ మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ బృందం ఆరా తీస్తోంది. 

also read:ఆనందయ్య మందు: తిరుపతి ఆయుర్వేద కళాశాలలో పరిశోధన వేగవంతం.. రాత్రికి నివేదిక

Latest Videos

undefined

ఇప్పటికే సుమారు 70 నుండి 80 వేల మంది ఈ మందును ఉపయోగించినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో కనీసం 500 మంది నుండి డేటా సేకరించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమాచార సేకరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విజయవాడ, తిరుపతి ఆయుర్వేద వైద్య కాలేజీలకు చెందిన వైద్య బృందం ఈ డేటా సేకరణలో ఉన్నారు. అయితే  ఆనందయ్య  వద్ద ఇచ్చిన  సమాచారం ఆధారంగా వైద్యులు తీసుకొన్న ఫోన్ నెంబర్ల  నుండి కచ్చితమైన సమాచారం రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు ఫోన్లకు స్పందించడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న బృందం సభ్యులు తెలిపారు. 

తిరుపతి ఆయుర్వేద కాలేజీ బృందానికి 250 మంది ఫోన్ నెంబర్లు అందాయి. అయితే  వీరిలో సుమారు 70 మంది వివరాలు తెలియరాలేదు. దీంతో మరో 60 మంది జాబితాను సేకరించిన వైద్యుల బృందం ఈ విషయమై  ఆరా తీస్తున్నారు. కరోనా వచ్చిన రోగులు ఈ మందు వాడిన తర్వాత ఎలా ఉన్నారనే విషయమై వైద్యులు డేటా సేకరిస్తున్నారు. 

ఈ డేటా పాజిటివ్ గా వస్తేనే పరిశోధనలు ముందుకు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. తొలి దశ పరిశోధనలు పూర్తైతేనే జంతువులపై ప్రయోగంతో పాటు ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే  ఈ మందు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొంటాయని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
 

click me!