జేసీ ఫ్యామిలీకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్.. తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయం

By Siva KodatiFirst Published May 26, 2023, 8:13 PM IST
Highlights

జేసీ కుటుంబానికి సవాల్ విసిరారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నియోజకవర్గంలో ఏనాడైనా జేసీ కుటుంబం డ్యామ్‌లను నింపిందా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఆ పనిచేసుంటే నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. 
 

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. గత కొన్నిరోజులుగా విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూనే వున్నారు. తాజాగా జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. జగన్ సీఎం అయ్యాక.. తాడిపత్రి నియోజకవర్గంలో డ్యామ్‌లను నింపి రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. కానీ.. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడూ ఇలాంటి పనులు చేయలేదంటూ కేతిరెడ్డి దుయ్యబట్టారు. వాళ్లు ఈ పనిచేసినట్లు నిరూపించగలరా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. 

గ్రామాల్లో ఫ్యాక్షనిజం, గొడవలను తగ్గించేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానని పెద్దారెడ్డి తెలిపారు. ప్రస్తుతం తాడిపత్రి ఎంతో ప్రశాంతంగా వుందని.. దీనికి సీఎం జగనే కారణమని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ముఠా కక్షలు, గొడవలు తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు. తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నానని కేతిరెడ్డి వెల్లడించారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి సెటైర్లు వేశారు. ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ.. ఇప్పుడు డ్యాన్సులు వేసుకునే స్థాయికి చేరారంటూ వ్యాఖ్యానించారు. 

Also Read: నాపై 78 కేసులు.. పూర్తి కావాలంటే ఇంకో జన్మ ఎత్తాలేమో : జగన్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు

ఇదిలావుండగా.. తనపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇటీవల విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై 78 కేసులు పెట్టారని, మళ్లీ జన్మ ఎత్తితే తప్పించి ఈ కేసులు పూర్తికావని సెటైర్లు వేశారు. అయినప్పటికీ తాను కేసులకు, జైళ్లకు భయపడేది లేదని జేసీ స్పష్టం చేశారు. రాజు తలచుకుంటే కేసులకు కొదవా.. ఏ కేసులో నేను కోర్టుకు వచ్చానో కూడా తెలియదన్నారు. జూన్ 26కు విచారణను వాయిదా వేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 

రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేం కూడా ఇలానే అనుకుంటే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కేసులు పెట్టడం సరికాదని జేసీ హితవు పలికారు. తాము పవర్‌లోకి వస్తే కేసులు పెట్టమని.. క్షమించేస్తామన్నారు. కేసులు పెట్టుకుంటేపోతే.. అందరూ కోర్టులలోనే వుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకూ పిల్లలు వుంటారని, వాళ్లు బాధపడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!