వివేకా కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌, రేపు సీబీఐ వాదనలు వింటామన్న హైకోర్ట్

By Siva Kodati  |  First Published May 26, 2023, 6:49 PM IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్ట్ రేపటికి వాయిదా వేసింది. రేపు సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. 
 


ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం వాదనలు ముగిశాయి. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది 5 గంటల పాటు, వైఎస్ సునీత తరపు లాయర్ గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో రేపు సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని హైకోర్ట్ పేర్కొంది. 

అంతకుముందు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ ఎదుట అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఉమా మహేశ్వరరావు వాదనలు వినిపించారు. అనంతరం తవాదనలకు ఎంత సమయం కావాలని సునీత, సీబీఐ తరపు న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో చెరో గంట కావాలని వారు తెలిపారు. అలా అయితే ఈరోజే విచారణ ముగుస్తుందని.. లేని పక్షంలో వేసవి సెలవుల అనంతరం వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం అవినాష్ రెడ్డి, సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను పూర్తి చేశారు. 

Latest Videos

ALso Read: కర్నూల్ విశ్వభారతి నుండి డిశ్చార్జ్: హైద్రాబాద్ ఎఐజీ ఆసుపత్రికి వైఎస్ శ్రీలక్ష్మి తరలింపు

ఈ క్రమంలో రూ.4 కోట్లతో అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటని లాయర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడని, అయితే ఆ డబ్బు అవినాష్ ఇచ్చినట్లు చెప్పారా అని ఆయన వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేసినట్లుగా ఎక్కడా కేసులు నమోదు చేయలేదని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆ వెంటనే సునీత తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు.

విచారణకు హాజరుకావాలని సీబీఐ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి.. ఏదో ఒకటి చెబుతున్నారని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా తల్లి అనారోగ్యం అంటున్నారని.. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంతోనే మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని వాదించారు. అంతేకాకుండా కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్ మద్ధతుదారులు ధర్నాలు చేస్తున్న ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేపు సీబీఐ తరపున వాదనలు వింటామంటూ విచారణను వాయిదా వేసింది. 
 

click me!