కష్టాల్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి: విచారణపై సర్వత్రా ఉత్కంఠ

Published : Nov 26, 2019, 12:10 PM ISTUpdated : Nov 26, 2019, 06:21 PM IST
కష్టాల్లో  వైసీపీ ఎమ్మెల్యే  శ్రీదేవి: విచారణపై సర్వత్రా ఉత్కంఠ

సారాంశం

 ఈ ఏడాది తాడికొండ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొనాలంటూ స్థానిక నేతలు కోరడంతో ఆమె విగ్రహ ప్రతిష్టకు వెళ్లారు. అయితే ఉండవల్లి శ్రీదేవి అన్యమతస్థురాలంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.    

అమరావతి: కుల వివాదంలో ఇరుక్కున్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జేసీ దినేష్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

ఎన్నికల కమిషన్ కు అందిన ఫిర్యాదు మేరకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉండవల్లి శ్రీదేవి కుల నిర్ధారణ విచారణ చేపట్టాలని జేసీ దినేష్ కుమార్ కు ఆదేశించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 
 
ఉండవల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులను సైతం జేసీ దినేష్ కుమార్ విచారించారు. అలాగే శ్రీదేవికి సంబంధించి మూడు తరాలకు చెందిన కుల ధ్రువీకరణ పత్రాలను అధికారుల ముందు ఉంచారు. 

శ్రీదేవి కులంపై ఫిర్యాదు: విచారణకు హాజరు కావాలని జేసీ ఆదేశాలు

బీజేపీ నేతల ముసుగులో టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పన్నుతున్నారంటూ శ్రీదేవి మండిపడ్డారు. తాను గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరానని ఆయన తన సవాల్ కి స్పందించలేదన్నారు. 

రాజధాని భూముల్లో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ అక్రమాలు బయట పెడుతున్నాననన ఉద్దేశంతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వినాయక చవితి రోజు జరిగిన వివాదాన్ని కేంద్రంగా చేసుకొని తన కులం పై లేనిపోని ఆరోపణలు సృష్టించారంటూ శ్రీదేవి ఆరోపించారు.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళనా లేక క్రిస్టియన్ అని నిర్ధారించేది జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కావడంతో విచారణపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జేసీ విచారణలో ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్ అని తేలితే ఆమె పదవికి ఎసరు వచ్చే అవకాశం లేకపోలేదు.

వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది తాడికొండ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొనాలంటూ స్థానిక నేతలు కోరడంతో ఆమె విగ్రహ ప్రతిష్టకు వెళ్లారు. అయితే ఉండవల్లి శ్రీదేవి అన్యమతస్థురాలంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఆమెను పలువురు దూషించారంటూ కూడా ఎమ్మెల్యే కంటతడిపెట్టారు. 

వినాయక మండపంలో దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీ కార్యకర్తలు తనను దూషించారంటూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

టీడీపీ నేతలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో శ్రీదేవి కుల వివాదాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినప్పటికీ ఆమె క్రైస్తవమతాన్ని స్వీకరించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఈసీలకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.

తన కులంపై వివాదం చెలరేగడంతో ఏకంగా రాష్ట్రపతి భవన్‌లోనే వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. అయితే ఈసీ ఆదేశాలతో గుంటూరు జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. అయితే ఉండవల్లి శ్రీదేవి క్రిస్టియన్ అని తేలుతుందా లేక ఎస్సీ అని తేలుతుందా అటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నియోజకవర్గ నేతలు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu