అనవసర రాద్ధాంతం చేస్తున్నారా?

First Published May 8, 2017, 3:13 AM IST
Highlights

ఇప్పటి వరకూ పీఠాల విషయంలో ప్రభుత్వం వేలు పెట్టినట్లు లేదు. ఒకవేళ విశాఖపీఠానికి స్వామి స్వరూపానంద పనికిరారని ప్రభుత్వం చెబితే ఎలా ఉంటుంది? స్వామి ఒప్పుకుంటారా? రాజకీయ నిరుద్యోగులను ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమిస్తే టిటిడికి నష్టం వాటిల్లుతుందని చెప్పటం కొసమెరుపు.

ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలో, ఏ అధికారితో ఏ పనిచేయించుకోవాలో పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటిది ప్రభుత్వ నిర్ణయంపై ఓ స్వామిజి అభ్యంతరాలు చెప్పటమేమిటి? తీసుకన్న నిర్ణయంపై కోర్టుకు వెళతామని బెదిరింపులేమిటో అర్ధం కావటం లేదు. ఇదంతా ఎందుకుంటే, టిడిపి ఇవోగా ఉత్తరాదికి చెందిన అశోక్ సింఘాల్ నియామకంపైనే.

ఇవోగా పనిచేయటానికి రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు ఉత్పాహంచూపారు. అయితే, వివిధ కారణాల రీత్యా చంద్రబాబునాయుడు ఉత్తరాదికి చెందిన సింఘాల్ ను నియమించారు. ఉత్తరాదికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని నియమించకూడదని ఎక్కడా లేదే?

టిటిడి ఇవోగా తెలుగు ఐఏఎస్ అధికారులనే నియమించాలని ఎక్కడా లేదు. సమర్ధులైన అధికారి అయితే చాలు. కాకపోతే తెలుగువారైతే ఉద్యోగులతో గానీ ఇతరులతో మాట్లాడేటపుడు ఇబ్బంది ఉండదు అంతే. అంతుకుమించి సౌలభ్యం ఏమీలేదు. ఉత్తరాదివారైనా తెలుగు వచ్చిన వారైతే ఇక సమస్యే లేదు. ఈ మాత్రానికే విశాఖపీఠాధిపతి స్వరూపానంద స్వామి అభ్యంతరాలు చెప్పటమేమిటో?

ప్రభుత్వ నిర్ణయాలను ఆక్షేపించటం, తలదూర్చటం స్వామీజీలకు ఎంతమాత్రం తగదు. సింఘాల్ నియామకం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, దురదృష్ణకరమని స్వామి వ్యాఖ్యానించటంలో అర్ధమేలేదు. పైగా మొన్నటి వరకూ పనిచేసిన సాంబశివరావును బదిలీ చేయటం పనికిమాలిన చర్యగా కూడా స్వామి వర్ణించేసారండోయ్.  ఎవరిని నియమించినా, ఎవరిని బదిలీ చేసినా, స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమిటో?

చదవటం, రాయటం రాని వారిని నియమించకూడదట. టిటిడి ఆగమాలపై అవగాహన లేనందువల్ల కీలక నిర్ణయాలు తీసుకున్నపుడు అనేక సమస్యలు వస్తాయని చెప్పటం పెద్ద జోక్. ఎందుకంటే, స్వామి చెప్పిన ప్రకారం తీసుకున్నా ఇప్పటి వరకూ పనిచేసిన ఇవోలకు టిటిడి ఆగమశాస్త్రాలపైన ఏమాత్రం అవగాహన ఉందని? ఇవోగా నియమితులైన వారెవరైనా రోజు వారి వ్యవహారాలపై వేలు పెట్టేందుకు లేదు. ఏదైనా సమస్య తలెత్తినపుడు ఆగమ పండితులుంటారు, లేదా వివిధ పీఠాధిపతులుంటారు సమస్య పరిష్కరం కోసం. అంతేకానీ ఇవో ఒక్కరే ఏ సమస్యనూ పరిష్కరించలేరు కదా?

ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తారట. ఇప్పటి వరకూ పీఠాల విషయంలో ప్రభుత్వం వేలు పెట్టినట్లు లేదు. ఒకవేళ విశాఖపీఠానికి స్వామి స్వరూపానంద పనికిరారని ప్రభుత్వం చెబితే ఎలా ఉంటుంది? స్వామి ఒప్పుకుంటారా? రాజకీయ నిరుద్యోగులను ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమిస్తే టిటిడికి నష్టం వాటిల్లుతుందని చెప్పటం కొసమెరుపు. దశాబ్దాలుగా జరుగుతున్న వ్యవహారం అదే కదా. ఇంతకు ముందెన్నడూ లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు చెబుతున్నట్లు? చూడబోతే, స్వామిజికి ప్రభుత్వానికి తెరవెనుక ఎక్కడో చెడినట్లుంది. అందుకే స్వామిజి అనవసర రాద్దాంతం చేస్తున్నారు.

click me!