
గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనపై ఇటీవలే టిడిపి నుండి సస్పెండ్ అయిన మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు చేసారు. కేవలం ఆరోపణలే కాదు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతొ ఒక్కసారిగా మంగళగిరి రాజకీయాలు వేడెక్కాయి.
మంగళగిరి రూరల్ మండల మాజీ టిడిపి మాహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి పాలేటి (krishnaveni paleti) తెలుగుదేశం పార్టీ ఐటీ టీమ్ తో పాటు నారా లోకేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఒక పథకం ప్రకారమే నారా లోకేష్ పర్యవేక్షణలో టిడిపి ఐటీ టీమ్ (TDP IT Team) మహిళల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారని కృష్ణవేణి ఆరోపించారు.
ఇలాగే తన ట్విట్టర్ పోస్టులను కూడా మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీటన్నిటికీ నారా లోకేషే కారణమని ఆరోపించారు. ఇలా ఆడపిల్లను అడ్డంపెట్టుకుని రాజకీయ చేయటం లోకేష్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కృష్ఱవేణి మండిపడ్డారు.
Video
మహిళలు తన పార్టీలో ఉన్నంత సేపు లోకేష్ కు దేవతలు కనిపిస్తారు... పార్టీలోంచి బయటకు వెళ్లగానే బజారు మనుషులు కనిపిస్తారంటూ ఎద్దేవా చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మహిళలపై ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇంకా అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలను కృష్ణవేణి సూచించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ టిడిపి నుండి కృష్ణవేణిని సస్పెండ్ చేశారు. దీంతో అప్పటినుండి ఆమె నారా లోకేష్ పై విమర్శలు చేస్తోంది. తాజాగా లోకేష్ పై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసి రాజకీయ దుమారం రేపింది.
తన సస్పెన్షన్ కు నిరసనగా గతంలో గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయం ముందు కృష్ణవేణి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. బిసి మహిళనైన తనపై కుట్రలు పన్ని కావాలనే పార్టీలోంచి బయటకు పంపారని ఆరోపించారు. ఈ సమయంలోనూ ఆమె లోకేష్ పైనే విమర్శలు చేసారు.
తాజాగా మరోసారి లోకేష్ నే కృష్ణవేణి టార్గెట్ చేసారు. మంగళగిరిలో లోకేష్ విస్తృతంగా పర్యటిస్తూ టిడిపి బలోపేతానికి ప్రయత్నిస్తున్న సమయంలో కృష్ణవేణి సీన్ లోకి వచ్చారు. లోకేష్ కు మహిళలంటే గౌరవమే లేదంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన రాజకీయంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే లోకేష్ విమర్శలు చేస్తున్న మంగళగిరి నాయకురాలు కృష్ణవేణి వెనక వైసిపి నాయకులుండి ఇదంతా నడిపిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించినందుకే కృష్ణవేణిని సస్పెండ్ చేసామని... దీంతో కక్ష్యపెంచుకున్న ఆమె వైసిపి నాయకులతో కలిసి లోకేష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.