ఏపీలో చర్మ పరిశ్రమ అభివృద్దికి జగన్ సర్కార్ చర్యలు... మంత్రి నాగార్జున కీలక ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 01, 2022, 03:59 PM ISTUpdated : Jun 01, 2022, 04:04 PM IST
ఏపీలో చర్మ పరిశ్రమ అభివృద్దికి జగన్ సర్కార్ చర్యలు... మంత్రి నాగార్జున కీలక ఆదేశాలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో చర్మ పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది వైసిపి ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో 9 లెదర్ పార్కుల అభివృద్ది, రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి నాగార్జున ప్రకటించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో చర్మ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.11.5 కోట్లతో చర్మకారుల కోసం రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న తొమ్మిది లెదర్ పార్క్ లను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.

రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్- లిడ్ క్యాప్) కార్యకలాపాలను మేరుగు నాగార్జున సమీక్షించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని వెన్నెలవలస( శ్రీకాకుళం), అడ్డాపుశీల(పార్వతీపురం), నూజివీడు(ఏలూరు), జి.కొండూరు (కృష్ణా), కల్లూరు పారిశ్రామికవాడ(కర్నూలు), అడిగొప్పుల(పల్నాడు), యడవల్లి (ప్రకాశం), రాచేపల్లి (అనంతపురం), మడకశిర(సత్యసాయి) జిల్లాల్లో తొమ్మిది లెదర్ పార్కుల్లో కార్యాకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

తొమ్మిది లెదర్ పార్కుల ఏర్పాటుకు గతంలో భూములను ప్రభుత్వం కేటాయించినా వీటిలో ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదని అన్నారు. ఈ కారణంగానే కొన్ని చోట్ల లెదర్ పార్కులకు కేటాయించిన భూములను ఇతర ప్రజావసరాలకు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇలా భూములను తీసుకున్న చోట ప్రత్యామ్నాయ భూములను లిడ్ క్యాప్ కు కేటాయించాల్సిందిగా కోరుతూ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. 

ఇక లెదర్ పార్కులలో మిగిలిన భూములను గుర్తించి అవి అన్యాక్రాంతం కాకుండా వాటికి సరిహద్దులను గుర్తించి, వాటిలో బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. లిడ్ క్యాప్ కు కృష్ణా జిల్లాలోని జి.కొండూరు లో 18 ఎకరాలు, ప్రకాశం జిల్లా యడవల్లిలో 27 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. ఈ రెండు లెదర్ పార్కుల్లో రూ.11.50 కోట్లతో చర్మ పరిశ్రమాభివృద్ధికి సంబంధించిన శిక్షణా కేంద్రాలను నిర్మించనున్నామని తెలిపారు. ఒక్కో పార్కులో భవనాలను నిర్మించడానికి రూ.5.75 కోట్లు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి రూ.కోటి చొప్పున ప్రభుత్వం కేటాయంచడం జరిగిందని మంత్రి వివరించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో లిడ్ క్యాప్ కు సంబంధించిన సొంత తయారీ కేంద్రాలు లేకపోవడంపై మంత్రి స్పందిచారు. ప్రైవేటు వ్యక్తులు తయారు చేస్తున్న వస్తువులను లిడ్ క్యాప్ పేరిట విక్రయించడం కాకుండా లిడ్ క్యాప్  ఆధ్వర్యంలో తోలు వస్తువుల తయారీకి సంబంధించిన సొంత యూనిట్లను ఏర్పాటు చేయాలని...ఇందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. లిడ్ క్యాప్ సొంతంగా బూట్లు, బ్యాగులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని మంత్రి నాగార్జున అభిప్రాయపడ్డారు. 

లిడ్ క్యాప్ అధికారులు రాష్ట్రంలో చర్మ పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి పనులను చేపట్టే సమయంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సలహాలను కూడా తీసుకోవాలని... అందరి అనుమతితోనే ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకోవాలని సూచించారు. ఏ విషయంలోనైనా ఏకపక్షంగా నిర్ణయాలన తీసుకోవడం తగదని హితవు చెప్పారు. విజయవాడ నగరంలోని ఆటోనగర్ లో ప్రధాన రహదారిపై ఉన్న లిడ్ క్యాప్ స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి నాగార్జున కోరారు.  
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu