వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

By telugu teamFirst Published Mar 18, 2020, 12:17 PM IST
Highlights

ఏపీ స్థానిక సంస్థల ఎన్నకల వాయిదాపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణపై అధికారం ఈసీకే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చేసింది. అయితే, కోడ్ ను మాత్రం ఎత్తేయాలని సూచించింది.

న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కొంత మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లే. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కే ఉంటుంందని సుప్రీంకోర్టు తేల్చేసింది. స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి అనుకూలంగానే తీర్పు వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. 

ఎన్నికలను వాయిదా వేయడాన్ని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఇది కొంత మేరకు జగన్ ప్రభుత్వానికి ఊరట కలిగించే విషయం. అయితే, కొత్త ప్రాజెక్టులను మాత్రం ఈసీని సంప్రదించిన తర్వాతనే చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోడ్ ను ఎత్తేయాలని ఈసీని ఆదేశించింది. 

ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు కాస్తా తీవ్రంగానే స్పందించింది. ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉండిందని అభిప్రాయపడింది. 

ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎన్నికల వాయిదాను కోర్టు సమర్థించింది. జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 

click me!