వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు సీరియస్..

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 6:00 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని చెప్పింది. వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐని ప్రశ్నించింది. 

ఈ కేసు విచారణ త్వరగా ముగించకుంటే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని సీబీఐ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ అభిప్రాయం అడిగి చెప్పాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉన్న దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ కేసు తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడానికి సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి,  అవినాష్ రెడ్డిలను సీబీఐ విచారించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడానికి వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘‘సీబీఐ చెప్పినట్లుగానే దస్తగిరి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించి, అతని స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని ఈ నేరంలోకి నెట్టడం సరైనది కాదు. దస్తగిరి  వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా మారిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరినే. సీబీఐ దస్తగిరికి బెయిల్ సమయంలో కూడా సహకరించింది. కింది కోర్టు దస్తగిరిపై ఉన్న ఆధారాలను పట్టించుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలి’’ అని వైఎస్ భాస్కర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

click me!