
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి, నేతిగుట్టపల్లె, ముదివేడు ప్రాజెక్టులు నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) విధించిన స్టే ఎత్తివేతకు జస్జిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అయితే ఎన్జీటీ విధించిన రూ. 100 కోట్ల జరిమానామాపై పాక్షికంగా స్టే విధించింది. ప్రస్తుతం రూ.25 కోట్లను కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. ఇక, ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్కు వాయిదా వేసింది.
ఇక, చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ- ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ గుత్తా గుణశేఖర్, మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఇటీవల రద్దు చేసింది. అదే సమయంలో ఏపీ సర్కార్‌కు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతులను పక్కన బెడుతూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.