ఓబుళాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు..

Published : Aug 25, 2023, 02:37 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు..

సారాంశం

ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం.. శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.  

శ్రీలక్ష్మిపై కేసు ఇదే.. 
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. అనంతపురం జిల్లా ఓబుళాపురం, మలపనగుడి గ్రామాల్లోని బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలోని ఓఎంసీకి మైనింగ్‌ లీజుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2009 డిసెంబర్‌ 7న సీబీఐ ఓఎంసీపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ.. 2012 మార్చి 30న ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్రీలక్ష్మి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

ఓఎంసీకి అనుకూలంగా అక్రమ మైనింగ్ లైసెన్సులను మంజూరు చేసేందుకు కుట్ర పన్నడం ద్వారా ఆమె తనకు లభించిన అధికారాలను దుర్వినియోగం చేసిందని అభియోగం మోపింది. అనంతపురంలో మైనింగ్ లీజులు మంజూరు చేయడంలో ఓఎంసీ ప్రమోటర్, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డితో ఆమె కుమ్మక్కైనట్లు సీబీఐ పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి 2011 నవంబర్ 28న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. ఇక, 2012 అక్టోబర్‌లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది. 2021లో సెప్టెంబరులో ఆమె విచారణను ప్రారంభించడానికి సీబీఐ కోర్టుకు స్వేచ్ఛ ఉందని తీర్పు వెలువరించింది. ఇక, ఈ కేసును కొట్టివేయాలని ఆమె వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు  కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే  ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది నవంబర్ 8న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  
 

PREV
click me!

Recommended Stories

భార్య కోరిక తీర్చిన పవన్ మురిసిపోయిన అన్నా లెజినోవా | Pawan Kalyan Buys Doll for Wife Anna Konidela
తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu