ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్... సుప్రీం న్యాయమూర్తి కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Nov 3, 2020, 1:19 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ మైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను ఏపీ హైకోర్టు ఎత్తివేయగా దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును వాదించకుండా తప్పుకుంటున్నట్లు... వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.  

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ వైసిపి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్ష, అపీల్) నిబంధనల నియమం 3(1) ప్రకారం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో తెలిపారు. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు నివేదికలో తేలిందని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. 

ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయని, దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.  

click me!