
నలుగురు సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కమీషనర్ల నియామకాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది. పదవీకాలం చివరికి వచ్చిన సమయంలో వీరి నియామకాన్ని కోర్టు తప్పుపట్టి ఏంటి ఉపయోగమన్నది వేరే సంగతి. సమైక్య రాష్ట్రానికి సిఎంగా ఉన్నపుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎనిమిదిమంది ఆర్టిఐ కమీషనర్ల నియామకాన్ని చేపట్టారు. వారిలో పలువురి నియామకాలను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కూడా అప్పట్లోనే తప్పు పట్టారు. సదరు నియామకాలను ఆమోదించేది లేదంటూ గవర్నర్ ఫైల్ ను తిప్పిపంపటం పెద్ద సంచలనం. అయితే, వివిధ కారణాల వల్ల అదే ఫైల్ కు గవర్నర్ సంతకాలు చేసారనుకోండి. దాంతో పలువురు సామాజిక ఉద్యమకారులు నియామకాలను సవాలు చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.
హైకోర్టు కూడా నియామకాలను తప్పుపట్టింది. దాంతో కమీషనర్లతో పాటు ప్రభుత్వం సుప్రింకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఆ కేసుకు సంబంధించే ఇపుడు సుప్రింకోర్టు నలుగురి నియామకాలను తప్పుపట్టింది. అప్పట్లో వర్రె వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, నిర్మలాకుమారి, విజయ్ బాబు, రతన్, మధుకర్ బాబు, మహేంద్రర్ రెడ్డి, ఇంతియాజ్ అహ్మద్ లను కిరణ్ నియమించారు. ఇపుడు వర్రె వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, నిర్మలాకుమారి, ఇంతియాజ్ అహ్మద్ నియామకాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది.
విచిత్రమేమిటంటే వీరి పదవీకాలం కూడా దాదాపు అయిపోవచ్చింది. ఈ సమయంలో వీరిని అనర్హులని చెప్పి ఏమిటి ఉపయోగం? అసలు వీరి నియామకమే తప్పన్నపుడు మరి ఇంతకాలం పదవుల్లో కొనసాగినందుకు వీరిపై ఏం చర్యలు తీసుకుంటారు? కనీసం వీరందుకున్న జీత, బత్యాలన్నా తిరిగి వసూలు చేస్తారా?
అదే విధంగా అనర్హులను నియమించినందుకు నియమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నియమించిన వారిపైనా చర్యలు తీసుకోక, పదవుల్లో కొనసాగిన వారిపైనా చర్యలు తీసుకోలేకపోతే ఇక సుప్రింకోర్టు తీర్పుకు విలువేం ఉంటుంది? తప్పు జరిగిందన్నపుడు చర్యలుంటేనే తరువాత వారు ఇటువంటి నియామకాలు చేయకుండా ఉంటారు. లేకపోతే కోర్టుల దారి కోర్టులదే, నియామకాలదారి నియామకాలదే అన్నట్లుంటుంది వ్యవహారం.