వైఎస్ షర్మిలకు అమరావతి ఉద్యమం ట్విస్ట్: సుంకర పద్మశ్రీ లేఖ

By Arun Kumar PFirst Published Apr 20, 2021, 5:26 PM IST
Highlights

రాజధాని కోసం తాము చేస్తున్న ఉద్యమానికి  మద్దతివ్వాలంటూ షర్మిలకు మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఓ బహిరంగ లేఖ రాశారు. 

విజయవాడ: మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 491రోజులుగా నిరసన తెలియజేస్తున్న అమరావతి మహిళలు వైఎస్ షర్మిల మద్దతు కోరారు. తమకు మద్దతివ్వాలంటూ షర్మిలకు మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఓ బహిరంగ లేఖ రాశారు. అమరావతి ఉద్యమం విషయంలో ఆ రకంగా సుంకర పద్మశ్రీ వైఎస్ షర్మిలకు ట్విస్ట్ ఇచ్చారు.

సుంకర పద్మశ్రీ లేఖ యధావిధిగా: 

శ్రీమతి వైఎస్ షర్మిల గారికి,

ఇటీవల మీరు తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చేసిన ధర్నా సందర్భంగా గాయపడటం విని సాటి మహిళలుగా బాధపడ్డాం. మీ పోరాటంలో ఎంత న్యాయం ఉందో, మేం 491 రోజులుగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అప్రతిహతంగా చేస్తున్న ఆందోళనలోనూ అంతే న్యాయం ఉంది. మిమ్మల్ని కేవలం ఒక్కసారి మాత్రమే పోలీసులు అవమానించి, గాయపరిచారు. కానీ మమల్ని ఏడాది నుంచీ జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వంలోని పోలీసులు ప్రతిరోజూ అవమానించి, గాయపరుస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. తెలంగాణలో మీ పోరాటానికి మీ వదిన భారతీరెడ్డిగారి సారథ్యంలోని సాక్షి మీడియా ఏవిధంగా కవరేజీ ఇవ్వడం లేదో, ఇక్కడ మా అమరావతి మహిళా పోరాటానికీ మీ వదినమ్మ గారి సాక్షి మీడియా కవరేజీ ఇవ్వకపోగా, మాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నది. ఈ విషయంలో మనం ఇద్దరమూ సాక్షి మీడియా బాధితులమే.
 
మీపై జరిగిన దాడికి తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి సమాధానం ఇవ్వాలని మీ తల్లిగారు, వైసీపీ గౌరవాధ్యక్షురాలయిన శ్రీమతి విజయమ్మ గారు డిమాండ్ చేశారు. నిజమే. దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదేవిధంగా అమరావతిలో మాపై ప్రతిరోజూ వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులకు మీ అన్న గారయిన జగన్మోహర్‌రెడ్డి గారి ప్రభుత్వం కూడా దిగివచ్చి సమాధానం చెప్పడమే ధర్మం కదా? విజయమ్మ గారు, మీరు ఈ విషయంలో జగన్ గారికి ఓమాట చెబితే తెలంగాణలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత ఉంటుంది. 

షర్మిల గారూ..అమరావతి కోసం మేం చేస్తున్న ఆందోళనకు మీ మద్దతు ఆశిస్తున్నాం. తెలంగాణ కోడలిగా మీరు అక్కడ పోరాటం చేస్తున్నట్లే, ఆంధ్రా బిడ్డగా మేం చేస్తున్న పోరాటానికి స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. ఆ మేరకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు అమరావతి మహిళా జేఏసీ ప్రతినిధి బృందం మీ వద్దకు రావాలనుకుంటున్నాం. కాబట్టి మీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ కోవిడ్ తీవ్రత కారణంగా మీరు రాలేకపోయినప్పటికీ, మా పోరాటానికి మద్దతునిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చినా మా పోరాటానికి మేలు చేసినవారవుతారు. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ...
               
సుంకర పద్మశ్రీ
(అమరావతి  మహిళా జేఏసీ)
                                                                  

click me!