ఆంధ్రా , ఒడిశా జోనల్ కమిటీ సభ్యుడు, బలిమెలలో పోలీసులపై దాడి ఘటనలో కీలక సభ్యుడు జలంధర్ రెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఎదుట మంగళవారం నాడు లొంగిపోయారు.
అమరావతి: ఆంధ్రా , ఒడిశా జోనల్ కమిటీ సభ్యుడు, బలిమెలలో పోలీసులపై దాడి ఘటనలో కీలక సభ్యుడు జలంధర్ రెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఎదుట మంగళవారం నాడు లొంగిపోయారు.తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కొంపల్లి గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ చాలా ఏళ్ల క్రితమే మావోయిస్టుపార్టీలో చేరాడు.
తొలుత ఆయన మెదక్ జిల్లా కమిటీలో పనిచేశాడు. ఆ తర్వాత ఆయనను ఏఓబీకి బదిలీ చేశారు. ప్రజా బలం లేక తాను జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. పార్టీ గతంలో లాగా లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాలలో పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మారాలని నిర్ణయించుకున్నాడుఏఓబీ లో ఎక్కువగా జరుగుతున్న పోలీస్ యాక్టివిటీస్ తో రిక్రూట్మెంట్ లేదని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. 2008లో బలిమెలలో పోలీసులపై దాడి ఘటనలో జలంధర్ రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నాడని డీజీపీ చెప్పారు. సున్నిపెంట, ఎర్రగొండపాలెం లో జరిగిన బాంబు పేలుళ్ళలో ఘటనలో కూడా జలంధర్ రెడ్డిపై కేసులున్నాయన్నారు.
మల్హాన్ గిరి కలెక్టర్ విన్నీ కృష్ణ కిడ్నాప్ కేసులో కూడ జలంధర్ రెడ్డి నిందితుడని డీజీపీ తెలిపారు. అంతేకాదు ఆరు హత్య కేసులు కూడ ఆయనపై ఉన్నాయని డీజీపీ గుర్తు చేశారు. జలంధర్ రెడ్డిపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2008 జూన్ నెలాఖరులో బలిమెల రిజర్వాయర్లో లాంచీలో ప్రయాణీస్తున్న పోలీసులపై రాకెట్ లాంచర్లతో మావోల దాడి లాంచీ డ్రైవర్ సహా 38 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.