రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామాలయంలో శ్రీరాముడి విగ్రహం తలను గుర్తుతెలియని దుండగులు నరికేసిన ఘటన మరువక ముందే తాజాగా రాజమండ్రిలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
రాజమండ్రి: అంతర్వేది రధం దగ్దం మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలు,దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. రెండు రోజుల క్రితమే
విజయనగరం జిల్లాలోని రామతీర్థం కోదండరామాలయంలో శ్రీరాముడి విగ్రహం తలను గుర్తుతెలియని దుండగులు నరికేసిన ఘటన కలకలం రేపింది. దీన్ని మరువక ముందే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
రాజమండ్రిలోని శ్రీరామనగర్‌లో ఉన్న ఓ హిందూ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. స్వామి విగ్రహం రెండు చేతులను నరికివేశారు. రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడగా ఉదయం పూజారులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు.
undefined
ఈ ఘటన గురించి తెలుసుకున్న హిందుత్వ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని... ఇందుకోసం ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలోని కోదండ రామస్వామి ఆలయంలో రాములవారి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రామయ్య విగ్రహ శిరస్సు భాగం రామ కొలనులో లభ్యమైంది. దీని కోసం నిన్నటి నుంచి పోలీసులు, అధికారులు కొలనులో విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు రాములవారి విగ్రహ పున: ప్రతిష్టకు అధికారులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేశారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాల కోసం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేదు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పూజారి అధికారులకు సమాచారం అందించారు.
దీంతో వారు పోలీసులకు తెలిపారు. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి వుంది. వెంటనే శిరస్సు భాగం కోసం ఆలయ పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరకలేదు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ప్రతినిధులు ఆధారాల సేకరణ ప్రారంభించారు. చివరకు కొలను రాములోరి తలభాగం లభించింది.