తెలుగు అకాడమీ పేరు మార్పుపై దుమారం.. బెజవాడలో విద్యార్ధి సంఘాల ఆందోళన

By Siva KodatiFirst Published Jul 13, 2021, 2:56 PM IST
Highlights

తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తాజాగా విద్యార్ధి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.
 

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ పేరు మార్పు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. తాజాగా మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి.. ప్రభుత్వ నిర్ణయానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా అకాడమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినపప్పటి నుంచి తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

పరభాష వ్యామోహంతో.. మాతృభాషను మృతభాషగా మార్చడం మంచిది కాదని ప్రసన్న కుమార్ హితవు పలికారు. తెలుగు మీడియం పూర్తిగా రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రసన్నకుమార్ హెచ్చరించారు. కాగా, గత శనివారం తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

click me!